Begin typing your search above and press return to search.

నవ్యాంధ్ర పాలిటిక్స్ లో 'నాన్నకు ప్రేమతో'

By:  Tupaki Desk   |   25 Jan 2016 9:11 PM GMT
నవ్యాంధ్ర పాలిటిక్స్ లో నాన్నకు ప్రేమతో
X
నవ్యాంధ్రలో 2019 ఎన్నికల టార్గెట్ గా చినబాబుల సందడి మొదలైంది. రాజకీయ ప్రముఖుల వారసులంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే చాలామంది వారసులు రాజకీయాల్లో స్పీడు చూపుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్నారు. సీఎం తనయుడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల తనయుల వరకూ అందరూ తమ రాజకీయ భవితవ్యానికి పునాదులేసుకుంటున్నారు. అటు వ్యాపారాలు, ఇటు రాజకీయాలు రెండు పడవలపై ప్రయాణంలో తనయుల అండ ఉంటే మరింత మంచిదన్న ఉద్దేశంతో వారి తండ్రులు కూడా తనయులను బాగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఏ నేతను కలిసినా ''బాబును కలిశారా?'' అన్న ప్రశ్నే వినిపిస్తోంది. ఏపిలో పార్టీలకతీతంగా సీనియర్ల తనయులంతా ఇప్పుడు నియోజకవర్గాలను శాసిస్తున్నారు. ఎమ్మార్వో నుంచి డీఎస్పీ వరకూ నియోజకవర్గ స్థాయిలో ఏ పని కావాలన్నా వారే చూస్తున్నారు. తండ్రులు హైదరాబాద్‌ లో పనులు చక్కబెడుతుంటే కొడుకులు నియోజకవర్గాల్లో హల్ చల్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ క్రియాశీల రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి కాబోయే అధినేతగా ఇప్పుడే రాటుతేలుతున్నారు. ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేసమయంలో ప్రతిపక్ష నేత జగన్ కూడా మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తనయుడిగా ఏపీలో అధికార పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత ఎర్రన్నాయుడు తనయుడైన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ వారసత్వాన్ని ఆయన తనయుడైన రాజంపేట ఎంపి మిధున్‌ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఆయనను ఇటీవలే ఎయిర్‌ పోర్టు మేనేజర్‌ ను కొట్టినందుకు అరెస్టు చేసి, జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. తండ్రి సాత్వికుడన్న పేరుంటే కొడుకు మిధున్ మాత్రం దూకుడుగా వెళుతున్నారు.

ఇక కొత్తగా తెరపైకి వస్తున్నవారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ. కేన్సర్ స్పెషలిస్టుగా పేరున్న ఆయన వైద్య వృత్తిని వదిలేసి, పూర్తి స్థాయి రాజకీయ నేతగా జనంలో ఉన్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పూర్తి స్ధాయి పట్టు సాధించే పనిలో ఉన్నారు. మంచి వక్త, దూకుడున్న నేతగా పేరు తెచ్చుకున్న ఆయన కోడెల వారసుడిగా ఎదుగు తున్నారు. తండ్రి ఇమేజ్‌ను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. ఆయన రాజకీయాలతో పాటు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. యువకులను సమీకరించడం, సొంత నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూడటంలో బిజీగా ఉన్నారు. పరిటాల వారసుడిగా ఎదిగే క్రమంలో ఉన్నారు. యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు.

శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు మనోహర్‌నాయుడు కూడా వచ్చే ఎన్నికల నాటికి గట్టిపడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై స్పందిస్తు యువతలో ఆదరణకోసం ప్రయత్నిస్తున్నారు.

విశాఖలో మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ , మాజీ మంత్రి దాడి వీరంభద్రరావు తనయుడు దాడి రత్నాకర్ జిల్లా, నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. మంత్రి అయ్నన్న కొడుకయితే దాదాపుగా షాడో మంత్రేనని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి బదులు ఆయనే పోటీ చేస్తారంటున్నారు.

మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంతోపాటు, జిల్లాలో యువనేతగా ఎదుగుతున్నారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్పెల్సీ అయిన గాలిముద్దుకృష్ణమనాయుడు తనయులు మనోజ్, జగదీష్ పోటాపోటీగా నగరిలో చక్రం తిప్పుతున్నారు.

కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. పత్తికొండలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు.

సీనియర్ నేత, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి తనయుడు పవన్ కూడా క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు ఇటీవలి కాలం నుంచే చురుకుగా పనిచేస్తున్నారు.

విజయవాడలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రు కొడుకు అవినాష్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో ఆయనకు ఇప్పటికే యువకుల్లో క్రేజ్ ఉంది.

ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్దా రాఘవరావు తనయుడైన సిద్దా సుధీర్ తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న దర్శిలో పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అటు వ్యాపారాలతోపాటు ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు.

-GARUDA