Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లకు కేసీఆర్ లేని లోటు ఎంతంటే..

By:  Tupaki Desk   |   13 May 2016 5:30 PM GMT
ఆంధ్రోళ్లకు కేసీఆర్ లేని లోటు ఎంతంటే..
X
గతంలోకి ఒక్కసారి వెళితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో ఏ పార్టీకి చెందిన ఏ స్థాయి నేత అయినా తాము తెలంగాణకు వ్యతిరేకమని కానీ.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేమని కానీ అనగలిగే ధైర్యం ఉండేదా? మనసు లోపల ఎలా ఉన్నా.. పార్టీ నేతలతో ఏదైనా చెప్పాల్సి వస్తే ఆచితూచి వ్యాఖ్యలు చేసే వారే కానీ.. నోటి వెంట ఒక్క తేడా మాట మాట్లాడేందుకు సైతం ఇష్టపడే వారు కాదు. ఎందుకిలా అంటే.. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమన్న మాట కానీ ఏ పార్టీ నేత నోటి వెంట వస్తే తెలంగాణ భగ్గుమనటమే కాదు.. వారు తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంది. అందుకే.. ఆచితూచి మాట్లాడేవారు.

దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి ఏపీలో కనిపించదు. విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ప్రాణవాయువుతో సమానంగా మారినా.. ఏపీ ప్రజలు కామ్ గా ఉండటం.. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ఉద్యమించే టీఆర్ ఎస్ లాంటి పార్టీ లేకపోవటం.. కేసీఆర్ లాంటి అధినేత లేకపోవటమే కారణం. దీంతోపాటు.. మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఏ పార్టీకి ఆ పార్టీ.. తమ పార్టీ అగ్రనేతల పట్ల అంతులేని వినయాన్ని ప్రదర్శించే వారే తప్పించి.. తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తినేలా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే సహించమని కరాఖండిగా చెప్పకపోవటం కూడా ఒక కారణం.

తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ పార్టీలు కేసీఆర్ అంటే విపరీతంగా భయపడేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏ పార్టీ అయినా ఎక్కువ.. తక్కువ మాట్లాడితే ఆయన ఒక్కసారిగా బయటకు వచ్చేవారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు మంటలు పుట్టటమే కాదు.. తెలంగాణ మొత్తం అట్టుడికిపోయేది. దీంతో.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగేది. వారి దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయ్యేది. ఏవరైనా నేత ఏదైనా మాట తూలితే.. వెంటనే దాన్ని సరి చేసుకొని చెంపలేసుకునేంత పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టేవారు కాదు.

అలాంటి శక్తివంతమైన ఉద్యమనేత.. రాజకీయ నాయకుడు ఆంధ్రాకు లేకపోవటం పెద్ద కొరతే. మొన్నటికి మొన్న కేంద్రమంత్రులు ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చేస్తే..పార్టీల ఆగ్రహంతో మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కాస్త సర్దిచెప్పినట్లుగా మాట్లాడారు. కానీ.. అంతలో ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సిద్దార్థ్ నాథ్ తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని మరోసారి చెప్పేసిన పరిస్థితి చూస్తే అనిపించేది ఒక్కటే. ఏపీకి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న మాట ఆంధ్రాకి ఓ కేసీఆర్ ఉండి ఉంటే అనగలిగేవారా? ఇప్పుడు అర్థమైందా.. ఆంధ్రాకి కేసీఆర్ లేని లోటు ఎంతన్నది..?