Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ‘ఆర్కే’ చేసిన కీలక వ్యాఖ్యల్ని మిస్ కాకూడదట!

By:  Tupaki Desk   |   20 Dec 2020 12:00 PM IST
కేసీఆర్ పై ‘ఆర్కే’ చేసిన కీలక వ్యాఖ్యల్ని మిస్ కాకూడదట!
X
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు మీడియాలో సిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా.. వాస్తవం ఏం జరుగుతుందన్నది చెప్పేవి లేవన్న విమర్శ ఉంది. దీనికి తోడు రాజకీయ పరిణామాల విషయంలో కుండబద్ధలు కొట్టినట్లుగా.. పార్టీ ఏదైనా సరే.. తప్పు చేస్తే బండకేసి బాదినట్లు.. ఒప్పు చేస్తే.. వీరి గొప్పతనం ఇది అంటూ తేల్చి చెప్పేంత సీన్ ఉన్న మీడియా కనిపించదు.

ప్రధాన మీడియా సంస్థలకు ఉన్న పరిమితులే ఇందుకు కారణం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వతహాగా పొలిటికల్ రిపోర్టర్ అయిన ఆంధ్రజ్యోతి యజమాని ఆర్కే.. ప్రతి వారాంతంలో తన కామెంట్ ను రాసేస్తుంటారు. సమకాలీన రాజకీయ అంశాలు.. పరిణామాలపై ఆయన విశ్లేషణ సాగుతుంది. ఇందులో నిజం ఎంత? అన్నది పక్కన పెడితే.. ఆయనకున్న పరిచయాలు.. నెట్ వర్కును చూసుకున్నప్పుడు ఆయన చెప్పే అంశాలు కొన్ని ఆసక్తికరంగానే కాదు.. ఔరా అనిపించేలా ఉంటాయి. తాజాగా అలాంటి అంశాల్నే ఆయన పేర్కొన్నారు. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఏమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘కేసీఆర్‌ అంటే అరివీర భయంకరుడు, ఎవరినీ లెక్కచేయని ధైర్యశాలి అని తెలంగాణ ప్రజలు నమ్ముతూ వచ్చారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆయన చేష్టలతో ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్‌ పాతాళానికి వెళ్లిందని చెప్పవచ్చు. కేసీఆర్‌ మాట మీద నిలబడే రకం కాదని ఆయన గురించి బాగా తెలిసినవారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయన నైజం ఏమిటో తెలంగాణ ప్రజానీకం కూడా గ్రహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్‌ తిరుగు ప్రయాణమైన తర్వాత ఆయన గురించి ఢిల్లీలో చులకనగా మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితికి కేసీఆర్‌ మాత్రమే కారణం!’’

‘‘ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కబుర్లు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో తనకు ఆటంకాలు సృష్టించరని కేసీఆర్‌ భావించడమే తప్పు. భారతీయ జనతాపార్టీ మాత్రమే బలపడాలని మోదీ, షా ద్వయం కోరుకుంటారు. ఈ క్రమంలో మిత్రపక్షాలను కూడా వారు ఉపేక్షించరు. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా బీజేపీ పెద్దలతో రాజీ పడాలనుకోవడం తొందరపాటు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఢిల్లీకి ఉరుకులు పరుగులు పెట్టినంత మాత్రాన కేంద్ర పెద్దలు ఆయనను స్థిమితంగా ఉండనిస్తారా?’’

‘‘నిజానికి ప్రజల్లో తన పట్టును తిరిగి పొందడానికి కావలసినంత వ్యవధి కేసీఆర్‌కు ఉంది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా బీజేపీ పెద్దలను కలిసి మంచి చేసుకోవడానికి ఎందుకు తొందరపడ్డారో తెలియదు. కొన్ని సందర్భాలలో కేసీఆర్‌ తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయన చర్యలు కూడా అతిగా అనిపిస్తాయి. ఉదాహరణకు మజ్లిస్‌ పార్టీతో అవసరానికి మించి ఆయన స్నేహం చేశారు. దీంతో బీజేపీకి అదే ఆయుధం అయింది. ఇప్పుడు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అడుగుతున్నప్పటికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇలాంటి అతి చర్యల వల్లే ఆయనకు నష్టం జరుగుతోంది’’

‘‘ఇంతకూ కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను ఏం కోరారు? ఏ హామీ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. బీజేపీకి చెందిన ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి.. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లింది ఆ పార్టీ పెద్దలతో సంధి కుదుర్చుకోవడానికే! ‘నేను అలసిపోయాను, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ఆ సీటులో నా కుమారుడైన కేటీఆర్‌ను కూర్చోబెట్ట బోతున్నా. బీజేపీతో కలసిమెలసి పని చేయడానికి మేం సిద్ధం.. గ్రేటర్‌ మేయర్‌ పదవిని బీజేపీ కోరుకుంటే అందుకు కూడా సహకరిస్తాం’ అని కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటనలో నమ్మబలికినట్టు తెలిసింది’’

‘‘ముఖ్యమంత్రి పదవి నుంచి తాను ఎప్పుడు తప్పుకొంటున్నదీ కేసీఆర్‌ స్పష్టత ఇవ్వలేదట. అయితే కేసీఆర్‌ మాటలను కేంద్ర పెద్దలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయన చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. తన ఆరోగ్యం సహకరించడం లేదనీ, ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడికి కట్టబెట్టాలనుకుంటున్నాననీ గతంలోనూ కేంద్ర పెద్దల వద్ద కేసీఆర్‌ చెప్పారు. ఈ మాట చెప్పి దాదాపు రెండేళ్లు అవుతోంది’’