Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్‌ కు అందిన మ‌రో అస్త్రం..

By:  Tupaki Desk   |   24 Sep 2019 10:21 AM GMT
సీఎం జ‌గ‌న్‌ కు అందిన మ‌రో అస్త్రం..
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్కో విజ‌యం సాధిస్తూ ముందుకు పోతున్నారు. అధికారం చేప‌ట్ట‌గానే ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పిపిఏల‌లో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించింది వైసీపీ ప్ర‌భుత్వం. విద్యుత్ పిపిఏల‌పై పునఃస‌మీక్ష‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది జ‌గ‌న్ స‌ర్కారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం ఇలా పిపిఏల‌పై పునః స‌మీక్ష స‌రికాద‌ని - దీంతో విద్యుత్ సంస్థ‌లు ఇబ్బందులు ప‌డుతాయ‌ని - మ‌రెవ‌రు ముందుకు రార‌ని చెపుతూ ఏపీ విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రించింది.

అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కేంద్రం చెప్పిన విష‌యాన్ని ప‌ట్టించుకోకుండానే టీడీపీ పాల‌న‌లో జ‌రిగిన అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేయాల్సిందే... అనే సంక‌ల్పంతో హైకోర్టును ఆశ్ర‌యించింది. పిపిఏల‌పై పునః స‌మీక్ష చేయాల‌న్న నిర్ణ‌యాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు - నేత‌లు చిలువ‌లు ప‌లువ‌లు చేసి రాద్ధాంతం చేశారు. అస‌లు పిపిఏల‌లో అవినీతే లేద‌ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం పిపిఏల‌లో యూనిట్‌ కు అధికంగా ఇస్తుంద‌ని ఆనాటి నుంచి ఆరోపిస్తూనే ఉంది.

పిపిఏల‌పై ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్ళింది స‌ర్కారు. హైకోర్టు కూడా స‌ర్కారు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించింది.. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంకు ఓ విజ‌యం ద‌క్కింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఏపీ స‌ర్కారు వేసిన పిటిష‌న్ల‌ను స‌మ‌ర్థిస్తూ - పిపిఏలపై పునః సమీక్ష అంశంపై హైకోర్టు లో విద్యుత్ కంపెనీలకు ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని మళ్లీ పరిశీలించే అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏలను పునః సమీక్షించేందుకు ఏపీఈఆర్సీకి వెళ్తామన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు సమర్ధించింది. పీపీఏల పునః సమీక్షను ఏపీఈఆర్సీ ముందే నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

ఏపీఈఆర్సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్దారించలేమని చెప్పింది హైకోర్టు. ఆరునెల్లలోగా ఈ వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ తేల్చాలని కూడా సూచించింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుల కింద యూనిట్ కి రూ.2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. మొత్తానికి విద్యుత్ కొనుగోలు పిపిఏల‌లో వైసీపీ ప్ర‌భుత్వం స‌మీక్ష నిర్వ‌హిస్తే భారీ అవినీతి అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు.. మొత్తానికి జ‌గ‌న్ స‌ర్కారు ఒక్కో ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని టీడీపీ స‌ర్కారు చేసిన అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తు చంద్ర‌బాబును దోషిగా ప్ర‌జ‌ల ముందు నిలిపే ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తున్న‌ట్టే ఉంది.