Begin typing your search above and press return to search.

అభివృద్ధి ప‌థ‌కానికి అత్త‌గారి పేరేంది బాబూ?

By:  Tupaki Desk   |   3 Aug 2018 2:11 PM IST
అభివృద్ధి ప‌థ‌కానికి అత్త‌గారి పేరేంది బాబూ?
X
గ‌తంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల‌కు ....పేర్లు మార్చి...తాజాగా గ‌ద్దెనెక్కిన ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కాలుగా చెప్పుకోవ‌డం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఏ ప్ర‌భుత్వం ఉన్నప్ప‌టికీ....కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన కొన్ని ప‌థ‌కాల‌కు పేర్లు మార్పు చేసి....వాటిని రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలుగా ప్ర‌చారం చేసుకోవ‌డం మ‌రో ర‌కం. ఇవి కాక....కొన్ని ప‌థ‌కాల‌ను రాష్ట్రం సొంతంగా రూపొందించుకొని....వాటికి త‌మ పార్టీకి చెందిన వారి పేర్ల‌ను పెట్ట‌డం ఆన‌వాయితీ. ఇందిర‌మ్మ ఇళ్లు - రాజీవ్ గృహ‌క‌ల్ప‌...అన్న క్యాంటీన్ ....లు ఇదే త‌ర‌హాలో వ‌చ్చిన‌వే. అయితే, అస‌లు పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్య‌క్తుల పేర్ల‌ను మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప‌థ‌కానికి పెట్టిన దాఖ‌లాలు లేవు. కానీ, ఏపీలోని టీడీపీ స‌ర్కార్ కొత్త సంస్కృతికి శ్రీ‌కారం చుట్టింది. ఏపీ ప్రభుత్వం బాలింతలకు కిట్ ఇచ్చే పథకానికి దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామారావు మొద‌టి భార్య బ‌స‌వ‌తార‌కం పేరు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

గతంలో యూపీఏ హయాంలో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌కు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మోదీ స‌ర్కార్ కొత్త పేర్లను పెట్టి చ‌లామ‌ణీలోకి తెచ్చింది. ఇక కాపీ క్యాట్ చంద్ర‌బాబు కూడా మోదీని ఫాలో అవుతున్నారు. ఏపీలో వైఎస్ ప్ర‌వేశ‌పెట్టి పాపుల‌ర్ అయిన ‘ఆరోగ్య శ్రీ’కి ఎన్టీఆర్ పేరు తగిలించారు. తాజాగా, అదే త‌ర‌హాలో ‘బసవతారకం మదర్ కిట్’ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ ప‌థ‌కంలో కేంద్రం...రాష్ట్ర ప్ర‌భుత్వాల శాతం సంగ‌తి ఎలా ఉన్నా....పేరు మాత్రం ఆక్షేప‌నీయంగా ఉంది. సాధార‌ణంగా గ‌తంలో ప్ర‌ధానులుగా - ముఖ్య‌మంత్రులుగా చేసిన వ్య‌క్తుల పేర్ల మీద ఈ ప్రభుత్వ ప‌థ‌కాలుండ‌డం ఆన‌వాయితీ. పోనీ...ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న చంద్ర‌న్న బీమా త‌ర‌హాలోనో....లేదంటే చిన‌బాబు లోకేష్ పేరు పెట్టినా పెద్ద‌గా ఎవ‌రూ ప్ర‌శ్నించేవారు కాదు. అయితే, ఎన్టీఆర్ భార్య అనే ట్యాగ్ మిన‌హా....పొలిటిక‌ల్ ట‌చ్ లేని బ‌స‌వ‌తార‌కం పేరును పెట్ట‌డం ఏమిట‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప‌క్క‌ నెహ్రూ - గాంధీల పేర్లతో కాంగ్రెస్ ప‌థ‌కాలున్నాయ‌ని విమర్శలు వస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు...త‌న అత్త‌గారిపై వాత్స‌ల్యాన్ని చాటుకోవ‌డం అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.