Begin typing your search above and press return to search.

బ్లేజ్ వాడ చల్లబడిపోనుందా?

By:  Tupaki Desk   |   18 Sept 2015 3:31 PM IST
బ్లేజ్ వాడ చల్లబడిపోనుందా?
X
బెజవాడ అనగానే ఏం గుర్తుకు వస్తుంది? అక్కడ ఎండాకాలం గుర్తుకు వస్తుంది. మండిపోయే ఎండలు గుర్తుకు వస్తాయి. పైనుంచి కిందికి కారిపోయే చెమటలు గుర్తుకు వస్తాయి. బాబోయ్ విజయవాడ అనే చాలామంది మాటలు గుర్తుకు వస్తాయి.

గుంటూరు అనగానే కూడా ఇదే పరిస్థితి. గుంటూరు - విజయవాడలను ఎండాకాలంలో తలుచుకోలేం కూడా. అంత దారుణమైన ఎండ ఉంటుందక్కడ. తలుచుకోవడానికే భయపడితే.. ఇక అక్కడ శాశ్వతంగా ఉండడం ఎలా? నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు చాలామందికి వచ్చిన సందేహమిది. చాలామందిని పట్టి పీడించిన భయం కూడా. కానీ, ప్రభుత్వం కూడా ఇదే అంశంపై కసరత్తు చేసింది. అందుకు పరిష్కారం కూడా కనుగొంది.

రాజధానిలో భాగంగా ఉంటున్న విజయవాడ - మంగళగిరి - గుంటూరు ప్రాంతాలను పచ్చని పూదోటగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఎటు చూసినా పచ్చని చెట్లు - హాయి గొలిపే మొక్కలతో విలసిల్లనుంది. ఏకంగా రూ.240 కోట్లతో ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఆమోద ముద్ర వేసింది.

నిజానికి ఇప్పటికే ఈ ప్రాంతంలో వేడి భరించలేకపోతున్నారు. గత ఏడాది అయితే 50 డిగ్రీలు దాటేసింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో పచ్చని స్వర్గమైన అమరావతి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు. ఇక్కడి మొక్కలు, చెట్లు, పంటలను తొలగించి భవనాలు నిర్మిస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం మరింత మండిపోనుంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించిన ప్రభుత్వం పచ్చదనానికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తోంది.

విజయవాడ - మంగళగిరి - గుంటూరు నగరాల్లోని రోడ్లపై ఉన్న డివైడర్ లపైనా.. రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాయాలు - సంస్థలు - ఖాళీ ప్రదేశాలు - కాలనీలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్రీనరీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్కుల సుందరీకరణ చేపడతారు. మొత్తంమీద ఎండ వేడితో మండిపోయే అమరావతిని చల్లని క్షేత్రంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం.