Begin typing your search above and press return to search.

ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   13 May 2016 2:04 PM IST
ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌
X
న‌వ్యాంధ్ర‌లో తొలి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు తాను అధికారంలోకి రాగానే ఇంటికో జాబు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు హామీతో నిరుద్యోగులు వేయిక‌ళ్ల‌తో నోటిఫికేష‌న్ల కోసం వెయిట్ చేస్తున్నారు. బాబు అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇంకా భారీ స్థాయిలో ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో నిరుద్యోగులంతా కాస్త నిరాశ‌లో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు త్వ‌ర‌లోనే తీపి క‌బురు అంద‌నుంది.

ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా రిలీజ్ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(ఏపీపీఎస్సీ) రెడీ అవుతోంది. ఇటీవ‌లే సీఎం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,250 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసు విభాగానికి చెందినవి 8 వేలుకాగా, మిగిలిన 12 వేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 1100 పోస్టుల‌తో భారీ గ్రూప్ -2 నోటిఫికేష‌న్ అతి త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంది. త‌ర్వాత సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఎఎస్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అవుతుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు త్వ‌ర‌లోనే రిలీజ్ చేసి వాటికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఫ‌లితాలు - నియామ‌కాల ప్ర‌క్రియ కూడా వ‌చ్చే ఐదారు నెల‌ల్లో.. ఈ యేడాది చివ‌రిలోగానే కంప్లీట్ చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ధ్యేయంగా తెలుస్తోంది.

ఇక ఇటీవ‌లే ఏపీపీఎస్సీ వెబ్‌ సైట్‌ కు కొత్త హంగులు కూడా అద్దారు. ఇక గ్రూప్ 1 - 2 - 4 ఉద్యోగాల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌ లలో మార్పులు చేయ‌నున్నారు. కొత్త సిల‌బ‌స్‌ పై వ‌చ్చిన అభ్యంత‌రాల‌పై ఆయా స‌బ్జెక్టుల నిపుణుల‌తో చ‌ర్చించి, నివేదిక రాగానే కొత్త సిల‌బ‌స్‌ ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఏదేమైనా న‌వ్యాంధ్ర‌లో ఈ యేడాది భారీగా ప్ర‌భుత్వ కొలువుల జాత‌ర జ‌రిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఈ ఛాన్స్‌ ను ఉప‌యోగించుకుని, కాస్త క‌ష్ట‌ప‌డితే ప్ర‌భుత్వ ఉద్యోగులైపోవ‌చ్చు.