Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు ఆల‌స్యం పాపం బాబుదేన‌ట‌

By:  Tupaki Desk   |   13 July 2018 11:35 AM IST
ఏపీ హైకోర్టు ఆల‌స్యం పాపం బాబుదేన‌ట‌
X
విడిపోయి సొంత కుంప‌టి పెట్టుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు రెండు ప‌ద్ధ‌తులు. ఒక‌టి విభ‌జ‌న సంద‌ర్భంగా అనుకున్న‌ట్లు హైద‌రాబాద్‌ లో ప‌దేళ్లు ఉండ‌టం.. మ‌రోవైపు ఏపీ రాజ‌ధానికి అవ‌స‌ర‌మైన హంగులు స‌మ‌కూర్చుకోవ‌టం. లేదంటే.. హ‌డావుడిగా అమ‌రావ‌తి వెళ్లిపోయి కిందా మీదా ప‌డ‌టం. చ‌ట్ట‌ప్ర‌కారం ప‌దేళ్లు హైద‌రాబాద్‌ లో ఉండే అవ‌కాశం ఉన్నా.. కేసీఆర్‌ ను కెలుక్కున్న కార‌ణంగా త‌ట్టా బుట్టా స‌ర్దేసుకొని హైద‌రాబాద్ ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితిని బాబు తెచ్చుకున్న వైనం అంద‌రికి తెలిసిందే.

చూస్తుండ‌గానే విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు గ‌డిచిపోయాయి. హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వెళ్లిపోయి రెండేళ్లు పూర్తి కావొస్తోంది. కానీ.. ఇప్ప‌టికి ఏపీ హైకోర్టు విష‌యం మీద లెక్క తేల‌టం లేదు. తెలంగాణ స‌ర్కారు అప్పుడ‌ప్పుడు ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. విడిపోయిన త‌ర్వాత ఈ ఉమ్మ‌డేంది? అంటూ చిరాకు ప‌డుతోంది.

ఏపీలో హైకోర్టు ఏర్పాటు విష‌యంలో కేంద్రం మీన‌మేషాలు లెక్కించ‌ట‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ అనుకునే ప‌రిస్థితి. అయితే.. అలాంటిదేమీ లేద‌ని త‌మ త‌ప్పు ఎంత మాత్రం లేద‌ని.. ఆల‌స్యానికి కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేనంటూ తేల్చి చెప్పింది కేంద్రం. ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన అంశాల‌పై బాబు నిర్ణ‌యం తీసుకోవ‌టంలో జ‌రుగుతున్న జాప్యమే ప్ర‌ధాన కార‌ణం త‌ప్పించి త‌మ త‌ప్పేం లేద‌ని స్ప‌ష్టం చేస్తూ తాజాగా ఒక అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది కేంద్రం.

హైకోర్టు విభ‌జ‌న‌పై జ‌రిగే జాప్యం మొత్తం ఏపీ ప్ర‌భుత్వ ఫెయిల్యూర్ అని అఫిడ‌విట్ లో స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. విభ‌జ‌న చ‌ట్టంలో ప‌దేళ్లు హైద‌రాబాద్ ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంచుకోవాల‌ని స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో హైకోర్టు విభ‌జ‌న‌కు గ‌డువు లేద‌న్నారు. హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి ఏపీ స‌ర్కారు భ‌వ‌నాలు.. మౌలిక‌స‌దుపాయాలు పూర్తిగా క‌ల్పించాల్సి ఉంద‌ని చెప్పింది. హైకోర్టు ఇష్యూలో ఏపీ స‌ర్కారు ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉందని స్ప‌ష్టం చేసింది.

ఇంత‌కూ ఈ ముచ్చ‌ట అంతా తెర మీద‌కు ఎందుకు వ‌చ్చిందంటే.. విభ‌జ‌న హామీల‌కు సంబంధించి వివ‌రాలు తేల్చాల్సిందిగా కాంగ్రెస్ నేత పొంగులేని సుధాక‌ర్ రెడ్డి సుప్రీంలో ఒక పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై జ‌రిగిన విచార‌ణ‌లో భాగంగా కేంద్రం హైకోర్టు మీద అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల్సి వ‌చ్చింది. విభ‌జ‌న హామీల అమ‌లుకు సంబంధించి మిగిలిన విష‌యాల మాట ఎలా ఉన్నా.. హైకోర్టు ఏర్పాటులో త‌మ త‌ప్పేం లేదంటూ కేంద్రం న్యాయ‌శాఖ స్ప‌ష్టం చేసింది.

ఏపీలో హైకోర్టు ఏర్పాటులో జ‌రిగే ఆల‌స్యానికి కార‌ణం ఏపీ స‌ర్కారే త‌ప్పించి త‌మది కాదంటూ కేంద్రం స్ప‌ష్టం చేస్తోంది.హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టు జ‌డ్జిల బృందానికి కొన్ని భ‌వ‌నాల్ని చూపించింది. వాటితోవారు సంతృప్తి చెంద‌లేదు. కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తామ‌ని కొత్త డిజైన్లు చూపించారు. వాటికి హైకోర్టు బృందం ఓకే చేసింది. ఈ భ‌వ‌నాల్ని మ‌ద‌ట నిర్మించిన త‌ర్వాత వాటిని సిటీ కోర్టుగా వాడుకోవాల‌ని.. అమ‌రావ‌తి కోర్ కేపిట‌ల్‌లో అద్భుతంగా అస‌లు హైకోర్టును నిర్మిస్తామ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు చెబుతోంది. ప్ర‌క‌ట‌న‌లు చాలానే వ‌స్తున్నాయే కానీ.. నిర్దిష్టంగా ఇప్ప‌టివ‌ర‌కూ అడుగు ప‌డింది లేదంటూ కేంద్రం ఏపీ స‌ర్కారు తీరును వివ‌రిస్తూ సుప్రీం కోర్టుకు అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అది చేస్తాం.. ఇది చేస్తాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామ‌ని చెప్పే చంద్ర‌బాబు హైకోర్టును యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఎందుకు పూర్తి చేయ‌న‌ట్లు..?