Begin typing your search above and press return to search.

అవును..ఈ 25న ఏపీ సచివాలయం ప్రారంభోత్సవం

By:  Tupaki Desk   |   23 April 2016 10:28 AM IST
అవును..ఈ 25న ఏపీ సచివాలయం ప్రారంభోత్సవం
X
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పూజల మీద పూజలు జరిగిపోతున్నాయి. కడుతున్నవి తక్కువ.. పూజలు ఎక్కువన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఆ మధ్యన రాజధాని భూమిపూజను నిర్వహించి ఆ తర్వాత శంకుస్థాపనను దసరా రోజున ఘనంగా నిర్వహించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత కాలంలో తాత్కాలిక సెక్రటేరియట్ భవనం కోసం భూమి పూజ తదితర కార్యక్రమాల్ని నిర్వహించిన ఏపీ సర్కారు.. తాజాగా ఈ నెల 25న సచివాలయాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

శ్లాబులు మాత్రమే పూర్తి అయిన భవనాన్ని.. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించటం ఏమిటన్న సందేహం అక్కర్లేదు. ఇదంతా అడ్జస్ట్ మెంట్ లో భాగమే. ఎందుకంటే.. ఈ నెల 29న తర్వాత సరైన ముహుర్తాలు లేకపోవటం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తతం అరకొర నిర్మాణం జరిగినా.. జూన్ నాటికి మొత్తం నిర్మాణం పూర్తి కానుంది. అయితే.. అప్పుడు మంచి ముహుర్తాలేమీ లేవు. దీంతో.. మంచి ముహుర్తంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

అదే జరిగితే..సచివాలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత దాదాపు నాలుగైదు నెలల వరకూ ఖాళీగా ఉంచాల్సిందే. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ నెల 25న అరకొర నిర్మాణం జరిగిన సచివాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ముందు అయితే పూజలు పూర్తి చేస్తే.. ఆ తర్వాత మిగిలినవి చూసుకోవచ్చన్న ధోరణి ఏపీ సర్కారులో ఉంది. అందుకే.. ఈ నెల 25న తెల్లవారుజామున 4.01 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు.

దాదాపు రూ.318 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ రెండో వారానికి హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని ఏపీకి తరలించాలన్న పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇలాంటి వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండే పనిలో భాగంగానే తాజా ప్రారంభోత్సవ కార్యక్రమంగా చెబుతున్నారు. పని సంగతి తర్వాత.. పూజలకు మాత్రం ఎలాంటి లోటు ఉండటం లేదనే చెప్పాలి.