Begin typing your search above and press return to search.

బాబు సర్కారుకు ‘ఆర్కే బీచ్’ వణుకు

By:  Tupaki Desk   |   24 Jan 2017 10:13 AM IST
బాబు సర్కారుకు ‘ఆర్కే బీచ్’ వణుకు
X
జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో.. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం సరికొత్త ఉత్సాహంతో ఏపీ యువత అడుగులు వేస్తున్న వైనం ఏపీ సర్కారుకు వణుకు తెప్పిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ హోదా సాధన కోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో నిర్వహించాలనుకుంటున్న మౌనదీక్ష బాబు సర్కారుకు ఇప్పుడు పెద్ద పరీక్ష కానుంది. రిపబ్లిక్ డే రోజున నిర్వహించే ఈ దీక్ష లోతును ఒక్కసారి చూస్తే.. ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసిన వారి తెలివిని మెచ్చుకోవాల్సిందే.

ఎందుకంటే.. విడిగా చూసినోళ్లకు రిపబ్లిక్ డే రోజున నిర్వహించే మౌనదీక్షగానే కనిపిస్తుంది. కానీ.. తరచి చూస్తే ఇందులో చాలానే కోణాలు కనిపిస్తాయి. నిజానికి ఏపీలో ఎన్నో ప్రాంతాలున్నా.. విశాఖనే ఎందుకుఎన్నుకున్నారన్నది చూస్తే.. వ్యూహాత్మకంగానే నిర్ణయం జరిగిందని చెప్పాలి.

మెరీనా బీచ్ మాదిరి.. ఆర్కే బీచ్ విశాలంగా ఉండటమే కాదు.. నిరసన తీవ్రత లోకానికి వెల్లడించేందుకు ఇంతకంటే అనువైన ప్లేస్ మరొకటి ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జనవరి 27..28 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఉద్దేశించిన ఈ సమ్మిట్ కు దేశ.. విదేశాల నుంచి పారిశ్రామిక ప్రముఖులు పలువురు వస్తుంటారు. వారు వచ్చే వేళ.. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రజల ఆందోళన తెలిస్తే.. కేంద్రానికి కలిగే నష్టంఅంతా ఇంతా కాదు.

దీంతో.. కేంద్రం నుంచి ఈ నిరసనలకు చెక్ చెప్పాలన్న ఒత్తిడి రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. వ్యాపార భాగస్వామ్య సదస్సు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు ముందే అంటే..జనవరి 26నే విశాఖకు రానున్నారు. ఒక పెద్ద కార్యక్రమం జరగటానికి ముందు రోజు చేపట్టే ఈ ఆందోళనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించటం కష్టం. ఒకవేళ అనుకోనిది ఏదైనా జరిగితే.. దాని వల్ల ఏపీ సర్కారు ఇమేజ్ కు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువే.

నిరసన ప్రదర్శన సక్సెస్ ఫుల్ గా పూర్తి అయితే.. ఆ ఒత్తిడి ఏపీ అధికారపక్షానికి బదిలీ అవుతుందన్నది మర్చిపోకూడదు. ఒకవేళ భావోద్వేగం భారీగా ఉండి.. అప్పటికప్పుడు దీక్షను మెరీనా బీచ్ తరహాలో కంటిన్యూ చేయాలన్న నిర్ణయమే వెలువడితే.. ఏపీ సర్కారుపరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారుతుందన్నది మాటల్లో చెప్పలేనిది. అలా అని.. ఈ మౌన దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తే.. ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. ప్రజల మనసుల్లో చంద్రబాబు విలన్ గా మారిపోవటంఖాయం. దాన్నిపోగొట్టుకోవటానికి ఆయన ఎంతకష్టపడినా ఫలితం అట్టే ఉండదనిచెప్పక తప్పదు. ఇవన్నీ చూసినప్పుడు ఆర్కే బీచ్ దీక్ష ఏపీ సర్కారుకు వణుకు తెప్పిస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/