Begin typing your search above and press return to search.

కొడైకెనాల్ లా నవ్యాంధ్ర పాలవాగు

By:  Tupaki Desk   |   31 Dec 2015 11:00 PM IST
కొడైకెనాల్ లా నవ్యాంధ్ర పాలవాగు
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అనంతవరం - వడ్డమాను - అబ్బరాజుపాలెం - బోరుపాలెం - రాయపూడి - వెలగపూడి - మందడం - తాళ్లాయపాలెం గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ గ్రామాల గుండా పాలవాగు ప్రవహిస్తుంది. పాలవాగు ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తుంది. కొండవీటి వాగు వరద కూడా కలిస్తే.. ఈ గ్రామాల్లోని సగానికి పైగా భూములు దాదాపు రెండు నెలలపాటు నీటిలో మునిగి తేలుతూ ఉంటారు. దాంతో అక్కడి పంటలు నాశనం అవుతాయి.

రాజధాని నిర్మాణం తర్వాత ఇటు పాలవాగు - అటు కొండవీటివాగు పొంగితే రాజధాని ప్రాంతం మునిగిపోతుంది కదా అనేది చాలామంది సందేహం. ఇటీవల కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, నవ్యాంధ్ర రాజధానికి ముప్పుగా ఉన్న పాలవాగును అద్భుతమైన కొడైకెనాల్ గా తీర్చిదిద్దాలని ప్రణాళిక రచించింది సింగపూర్ కు చెందిన సుర్బానా సంస్థ.

పాలవాగును అమరావతి కేంద్ర ప్రాంతానికే మణిహారంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఎంత వరద వచ్చినా సరే.. పాలవాగును దాటి రాజధాని ప్రాంతంలోకి అవలీలగా చేరుకునేలా ఎనిమిది వంతెనలు నిర్మిస్తున్నారు. రాయపూడి - లింగాయపాలెం - మోదుగ లింగాయపాలెం - ఉద్దండరాయునిపాలెం - తాళ్లాయపాలెం సమీపంలో ఈ ఎనిమిది వంతెనలనూ నిర్మిస్తారు. పాలవాగుకు ఇరువైపులా బోట్ క్లబ్లు - స్పోర్ట్స్ క్లబ్ లతో పర్యాటకాన్ని పెంచుతారు. వాగులో వాటర్ టాక్సీలను నడుపుతారు. పాలవాగు పొడవునా కొన్నిచోట్ల రిసార్టులను నిర్మిస్తారు. దీంతో ఇది కొడైకెనాల్ వంటి ఒక అద్భతు పర్యాటక ప్రాంతంగా మారుతుందని, సినిమా షూటింగ్ లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.