Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎంత అడ్వాన్స్ ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   4 Nov 2016 11:00 PM IST
అధికార పార్టీ ఎంత అడ్వాన్స్ ఉందో తెలుసా?
X
రాజ‌కీయ ప‌రిణామాల్లో చాలా ముంద‌స్తు ఆలోచ‌న‌తో ఉండే ఆంధ్రప్రదేశ్ రాజ‌కీ నాయ‌కులు ఈ క్ర‌మంలో మ‌రో అడుగు వేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల తర్వాత జ‌రుగనున్న పుర‌పాల‌క వేడి ప్రారంభం అవుతున్న ద‌శ‌లో ఉండ‌గానే...2017 మార్చిలో జరగనున్న పట్టభద్రులు - ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. య‌థావిధిగానే అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌క పావులు క‌దుపుతోంది. ఏకంగా మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి గ్రాడ్యుయేట్ల ఓట్ల‌ను జేబులో వేసుకునేందుకు ప్ర‌ణాళిక‌లు కొన‌సాగుతున్నాయి.

పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం - విశాఖపట్నం - విజయనగరం - కోస్తాంధ్రలో కోస్తా - రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు జిల్లాలు - రాయలసీమలో కర్నూలు - కడప - అనంతపురం జిల్లాల్లో మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు జిల్లాల్లో ఒకస్థానం - కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల్లో మరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌ లాల్ ప్రకటించారు. ఈనెల 5వ తేదీలోగా ఓటు నమోదు చేయించుకోవలసిందిగా ఆయన సూచించారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మార్చి మొదటి వారంలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో నిలిచి పావులు కదుపుతోంది. మొత్తం ఐదు స్థానాలు దక్కించుకునేందుకు ఆ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఈ ఐదు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించేలా నాయకులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో కూడా ఆయన ఈ ఎన్నికలపైనే దృష్టి సారించి నేతలకు పలు సూచనలు చేశారు. ఈ రెండు రంగాలకు చెందిన ఓటర్లను నమోదు చేయించే బాధ్యత కూడా పార్టీ నాయకులకు అప్పగించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుందని భావించిన చంద్రబాబు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల విజయంపైనే దృష్టి సారించారు. ఈ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నాలుగు స్థానాల్లో వామపక్షాలకు చెందిన ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (పిడిఎఫ్‌) అభ్యర్థులే ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పిఆర్‌టియూ అభ్యర్థి కొనసాగుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంతో పాటు వామపక్షాలకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉండడం, ముఖ్యంగా ఉద్యోగులందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందున ఐదు నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించగలమన్న ధీమాతో అడుగులు వేయనుంది. ఉపాధ్యాయులను ఓటర్లుగా నమోదు చేయించుకునే ప్రక్రియలో స్థానిక పార్టీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సూచించారు. జిల్లాల వారీగా ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకునేందుకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి - డాక్టర్‌ పి.నారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వామపక్షాలకు మంచి పట్టు ఉన్నందున వారి మద్దతు కూడగట్టేలా పార్టీ వ్యవహరిస్తోంది. కృష్ణా - గుంటూరు నియోజకవర్గంలో వామపక్షాల అభ్యర్థి రెండుసార్లు విజయం సాధించగా, పార్టీ అధికారంలోకి రాగానే అదే అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి ఘనవిజయం సాధించడం గమనార్హం. ఇప్పుడు కూడా తాము అధికారంలో ఉన్నందున అదే ఫలితాలను మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సాధిస్తామన్న ధీమాతో పార్టీ నాయకత్వం ఉంది. అయితే టీచర్లను తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు పార్టీ స్థానిక నేతలను కూడా భాగస్వామ్యంచేసి తమకున్న పరిచయాలతో మద్దతు కూడగట్టాల్సిందిగా చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం జిల్లాస్థాయి నాయకులు మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయి కార్యకర్తలను కూడా తమ బంధుత్వాలతో కూడా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తంగా హాట్ హాట్‌ గా సాగుతున్న ప‌రిణామాలు ముంద‌స్తు వేడిని సృష్టిస్తున్నాయ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/