Begin typing your search above and press return to search.

7నెలలు కాదు 7రోజులు మాత్రమే గడువు

By:  Tupaki Desk   |   2 Nov 2015 6:10 AM GMT
7నెలలు కాదు 7రోజులు మాత్రమే గడువు
X
ఎంత సాఫ్ట్ వేర్ బూమ్ వచ్చినా.. ఇప్పటికీ సర్కారు కొలువు దొరికిందంటే అదో అద్భుతం. లక్షలాది రూపాయిల జీతం వచ్చే ఐటీ ఉద్యోగి సైతం.. తన జీతంలో సగానికి సగం ఇచ్చి సర్కారు కొలువు దొరికితే ఏమాత్రం ఆలోచించకుండా మారిపోతామని చెప్పే వారు ఎందరో కనిపిస్తారు. లక్షల్లో జీతాలు ఉన్నప్పటికీ.. భవిష్యత్తు మీద నిత్యం భయంతో గడిపే ప్రైవేటు ఉద్యోగికి లేనన్ని ప్రత్యేక ఆప్షన్లు ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకుంటాయి?

ఎవరైనా ప్రైవేటు ఉద్యోగిని ఫలానా చోటు నుంచి ఫలానా చోటుకు బదిలీ చేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారు? బదిలీ కారణంగా తనకు ఇబ్బంది అయితే ఆ విషయాన్ని యాజమాన్యానికి చెప్పే ప్రయత్నం చేస్తారు. బదిలీ విషయంలో యాజమాన్యం ఒకసారి నిర్ణయం తీసుకున్నాక.. దాన్ని మార్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బదిలీ అన్నాక.. ఎక్కడ ఏమిటన్న విషయంలో చికాకులు ఉన్నప్పటికీ ఉద్యోగం కోసం వెళ్లటం అన్నిచోట్ల కనిపిస్తుంది.
మామూలుగానే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి.. విభజన కారణంగా ఏపీకి ఎంతో నష్టం జరిగిన వేళ.. ఏపీ రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయాల్సిన ఉద్యోగులు ఎంత కమిట్ మెంట్ తో పని చేయాలి? విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని సచివాలయంలో పని చేసే ఉద్యోగులు.. విభజన తర్వాత హైదరాబాద్ లో తిష్ట వేసుకొని కూర్చోవటం ఎంతవరకు ధర్మం.

సొంతిల్లు ఉన్న తర్వాత అద్దె ఇంట్లో కాలం గడిపే వారు ఉంటారా? కొంతమంది కొన్ని ప్రత్యేక కారణాలతో అద్దెకు ఉన్నా.. విపరీతమైన వేదనకు గురి అవుతుంటారు. సొంతింట్లో ఉండలేకపోతున్నామన్న బాధ వారి మాటల్లో వినిపిస్తుంటుంది. కానీ.. దీనికి పూర్తి భిన్నంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల తీరు ఉంది. సొంతింటికి వెళ్లేందుకు ససేమిరా అనటమే కాదు.. సొంతింటికి వెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు పెట్టటం ఏపీ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది.

వేలాది రూపాయిల జీతాలు.. అలవెన్సులు.. ఇలా ఎన్నో వసతులు పొందే వారు.. ఏపీ రాష్ట్ర సంక్షేమం కోసం.. కోట్లాది మంది ప్రజల కోసం.. వారి అభివృద్ధి కోసం నిత్యం ఆలోచించాల్సింది పోయి.. కేవలం తమ స్వార్థం కోసం మాట్లాడటాన్ని ఏమనాలి?

పన్నులు కట్టి.. తామిచ్చిన ఆదాయంతో జీతాలు తీసుకునే వారు.. పన్నులు కట్టిన ప్రజల దగ్గరకు ఉండి పని చేయలేమని చెబితే.. అలాంటి వారి జీతాల కోసం ఏపీ ప్రజలు ఎందుకు పన్నులు కట్టాలి? మా సుఖం మేం చేసుకుంటాం.. కుదిరితే పని చేస్తాం? కుదరకపోతే చేయలేమన్న బరితెగింపు మాటల్నిసీమాంధ్రులు ఎందుకు సహించాలి?

తాము ఏపీ రాజధానికి రావాలంటే అవి ఉండాలి? ఇవి ఉండాలి? అన్న కోర్కెల చిట్టా విప్పుతున్న ఏపీ సచివాలయ సిబ్బంది ప్రజల కోసం పని చేస్తారా? .. వారి కోసం ఏపీ ప్రజలు పని చేయాలా? ముఖ్యమంత్రి మొదలు.. మంత్రుల వరకూ అరకొర వసతులతోనే పని చేస్తుండగా లేనిది.. ఏపీ సచివాలయ సిబ్బంది సర్దుకోలేరా? తాము విజయవాడకు రావాలంటే కనీసం ఏడు నెలల సమయం కావాలని అంటున్న వారి మాటలు మొదట్లో పోనీలే అన్నట్లుగా సీమాంధ్ర ప్రజలు ఫీలయ్యే వారు.

కానీ.. తాజాగా వారి వైఖరి చూస్తున్న వారికి అసలు ఏడు నెలలు ఎందుకు.. ఏడురోజుల నోటీసు పిరియడ్ ఇచ్చేసి.. వెనువెంటనే విజయవాడకు రావాలని ఆదేశించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగం చేయాలని భావించినోళ్లే ఏపీ రాజధానికి వస్తారని.. మిగిలిన వాళ్లు రాలేకపోతే.. న్యాయసంబంధిత చర్యలు తీసుకునేలా ఏపీ సర్కారు తన పని తాను చేసుకుంటూ పోవాలన్న మాటకు మద్ధుతు రోజురోజుకీ పెరుగుతోంది.

ఉద్యోగులు అందరూ ఏపీ రాజధాని (తాత్కాలిక) కి వస్తే కానీ పనులు మొదలు కావు. ముఖ్యమంత్రి.. మంత్రులు విజయవాడలో ఉంటే... అధికారులు హైదరాబాద్ లో ఉండి రిమోట్ పాలన చేస్తామని చెప్పటంలో అర్థం లేదు. ఇప్పటికే ఏపీ సచివాలయ ఉద్యోగుల సాదకబాధలు అర్థం చేసుకొని వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అందరూ తరలి రావాలన్న ఆప్షన్ ఇస్తున్నప్పటికీ.. సంతృప్తి చెందని ఏపీ సచివాలయ ఉద్యోగుల తీరు చూసినప్పుడు.. అంత సమయం ఇవ్వాల్సిన అర్హత వారికి లేదన్న భావన కలుగుతోందని పలువురు సీమాంధ్రులు అభిప్రాయపడుతున్నారు. కేవలం తమ కుటుంబం మాత్రమే బాగుంటే చాలన్న ధోరణితో ఉన్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల అవసరం సీమాంధ్రులకు ఉందా? ఇలాంటి వారు సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారంటే నమ్మగలమా? అందుకే.. సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులకు ఏడు నెలలు కాదు.. ఏడు రోజులు మాత్రమే గడువు ఇవ్వాలన్న డిమాండ్ సీమాంధ్రుల్లో రోజురోజుకీ పెరుగుతోంది.