Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి అమ‌రావ‌తి... నువ్వు ఎక్క‌డున్నావు?

By:  Tupaki Desk   |   25 Oct 2018 3:30 PM GMT
అమ‌రావ‌తి అమ‌రావ‌తి... నువ్వు ఎక్క‌డున్నావు?
X
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే....నత్త నడకన పనులు... ఇలాంటి విశేషణాలేవీ వీరికి పనికిరావు. ఇంతకు మించి ఇంకేమైనా కొత్త అర్ధాలు వచ్చే మాటలుంటే వాటిని వాడాలి.వాటిని రాయాలి. ఎవరిని అనుకుంటున్నారా.. ఇంకెవరిని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివ్రద్ధి కోసం తీసుకువచ్చిన సింగపూర్ కన్సార్టియం వారినే. ఎందుకంటారా... స్టార్ట్ అప్ అంటూ వీరు అమరావతిలో ప్రారంభించిన పనులు అంగుళం కూడా ముందుకు వెళ్లడం లేదు. ఇక్కడున్న సంస్ధలు - కాంట్రాక్టర్లు కాదని - సింగపూర్ వాళ్లైతే పనులు చకచకా జరిగిపోతాయంటూ ముఖ్యమంత్రి ఆ దేశానికి ఇంత పెద్ద కాంట్రాక్ట్ అప్పగించారు. అయితే వారు చేస్తున్న అభివ్రద్ధి పనులు చూసిన ముఖ్యమంత్రే ముక్కున వేలేసుకుంటున్నారు. చివాట్లు పెట్టినా... పైకి మాత్రం తేలు కుట్టిన దొంగలా మారింది ముఖ్యమంత్రి పరిస్థితి. 1600 ఎకరాల స్టార్టప్ కోసం కేటాయించారు.అయితే ఇందులో 230 ఎకరాలు నదికీ - కరకట్టకు మధ్యలో ఉండడంతో సింగపూర్ కన్సార్టియంకు పనులు ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు.దీంతో ఈ అవరోధాన్నించి బయటడేందుకు ప్రత్యామ్నాయ మార్గం కోసం సింగపూర్ కన్సార్టియం మరో చోట పనులు ప్రారంభించేందుకు సిఆర్‌ డీఎను కోరింది.అయితే అక్కడి నుంచి కూడా సానుకూలత రాకపోవడంతో అమరావతి అభివృద్ధి పనులు వచ్చే ఎన్నికల వరకూ కూడా ముందుకు సాగేలా కనిపించడం లేదంటున్నారు.

రాజధాని నిర్మాణంలో భాగంగా స్టార్టప్ ప్రాంతమంటూ వందలాది ఎకరాల భూమిని సింగపూర్ కన్సార్టియంకు అప్పగించింది ప్రభుత్వం. ఇక్కడ వాణిజ్య సముదాయాలు,ఆకాశహార్మాన్లు నిర్మిస్తారని కూడా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రచారం చేశారు. అయితే ఇక్కడి పరిస్ధితులు మాత్రం అందుకు తగ్గట్లుగా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. సింగపూర్ సంస్ధల కన్సార్టియం - అమరావతి అభివ్రద్ధి సంస్ధ కలిపి దీనిని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. దీనికి సింగపూర్ కన్సార్టియం 58 శాతం - అమరావతి అభివ్రద్ధి సంస్ధ 42 శాతం పెట్టుబడులు పెడతాయని నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇవన్నీ కాగితాలకే పరిమితం చేసి ఇప్పుడు రెండు సంస్ధలు కూడా చేతులు ఎత్తేయడం ప్రభుత్వ డొల్లతనాన్ని తెలియజేస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నిర్దేశించుకున్న లక్ష్యాలు కూడా ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత 1.25 లక్షల కుటుంబాలు అమరావతికి తరలి రావాలన్నది ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తే మాత్రం ఈ లక్ష్యంలో సగంలో సగం కంటే తక్కువే పని అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇక్కడ ఉద్యోగాల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే ీఅంత మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఫలితం మాత్రం కానరావడం లేదని అధికార పార్టీ వారే చెప్పుకోవడం విశేషం.