Begin typing your search above and press return to search.

ఒకే ప్రయాణానికి రెండు టికెట్లు కొంటున్న ఏపీ అధికారులు

By:  Tupaki Desk   |   22 Feb 2016 6:14 AM GMT
ఒకే ప్రయాణానికి రెండు టికెట్లు కొంటున్న ఏపీ అధికారులు
X
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగం విమానాలకే ఖర్చవుతోందట. చంద్రబాబు పెట్టే మీటింగులు - సమీక్షల కోసం హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తున్న అధికారులు విమాన టికెట్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందట. అయితే... అందులో అధికారులు చేస్తున్న దుబారా ఏమీ లేదని.. టైమూపాడూ లేకుండా పెడుతున్న సమావేశాల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందట.

హైదరాబాద్‌ నురచి విజయవాడకు వెళ్లివచ్చేందుకు అధికారులు చేస్తున్న ఖర్చు రోజురోజుకూ ఎక్కువవుతోంది. ప్రతి నెలా విజయవాడలో జరిగే సమావేశాలకు వెళ్లే అధికారులు భారీగా సొమ్ములు విమానాలకు పోసేస్తున్నారు. ఇందులో కొంత ప్రయాణం చేసే విమానాలకు పెడుతున్న ఖర్చయితే.... ఇంకొంత టికెట్ బుక్ చేసుకున్నా ఎక్కకుండా వదిలేసిన విమానాలకు పెడుతున్న ఖర్చు. దీంతో ఖజానాకు తీవ్ర భారంగా మారుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న సమయపాలన లేని సమీక్షల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశాలకు హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న అధికారులు తిరిగి హైదరాబాద్‌ వచ్చేందుకు ముందుగానే రిటర్న్ టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. సమావేశం సుమారుగా ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేసుకుని కొంత, చంద్రబాబు షెడ్యూల్ ఆధారంగా కొంత ఇలా రిటర్న్ టికెట్లు బుక్ చేస్తున్నారు. రిటర్న్ టికెట్ చేసుకోకపోతే మళ్లీ సెక్రటేరియట్ లో పనులు చూసుకోవడం కూడా కష్టమే కాబట్టి అధికారుల ప్లానింగ్ ను కూడా తప్పు పట్టడానికి లేదు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ అలా బుక్ చేసుకున్న విమానాలు ఎక్కలేకపోతున్నారు. సమీక్ష పూర్తి కావాల్సిన సమయానికి కూడా... ఆ సమీక్ష ప్రారంభం కాకపోవడంతో అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. దీంతో విమానం మిస్సవుతున్నారు. ఒక్కోసారి సమీక్షలు మొదలైనా ఎప్పుడు ముగుస్తుందో తెలియక చివరి నిమిషం వరకు టికెట్ క్యాన్సిల్ చేసుకోలేకపోతున్నారు. చివరకు ఆ విమానం మిస్సయి ఎలాగోలా మరో విమానానికి టికెట్‌ సంపాదిరచుకుని వెళ్లాల్సి వస్తోంది.

దీనివల్ల ఒక ప్రయాణానికి రెరడు టికెట్లు కోనుగోలు చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. టిక్కెట్ల క్యాన్సిల్ వల్ల రిటర్న్ ఏమీ ఉండదు... పైగా కొత్త టిక్కెట్ అప్పటికప్పుడు కావాలంటే ధర ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా కలెక్టర్ల సదస్సు వంటి కార్యక్రమాల సమయంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సదస్సు ఎప్పటికి పూర్తవుతుందో అజెండాలో ఉంటున్నా సమావేశాలు మాత్రం అర్ధరాత్రి దాటాకే ముగుస్తున్నాయి.

కాగా... ఇలా విమాన టికెట్లకు ఆర్ధిక శాఖ కేవలం రూ.5 వేలకే గరిష్ఠంగా పరిమితి విధించింది. కానీ, ఈ క్యాన్సిలేషన్లు, అప్పటికప్పుడు అధిక ధరకు టిక్కెట్లు కొనడాలు వల్ల అంతకు రెట్టింపు ఖర్చవుతోంది. దీంతో అధికారులు జేబులోంచి పెట్టుకుంటున్నారు. తాజాగా మళ్లీ కలెక్టర్ల సమావేశం అనడంతో అధికారులంతా తమ జేబుకు చిల్లు పడడం గ్యారంటీ అని ముందే రెడీ అయిపోతున్నారు.