Begin typing your search above and press return to search.

అలా అయితేనే ఫ్లైట్ ఎక్కాలంటున్న ఏపీ సర్కారు

By:  Tupaki Desk   |   24 Sep 2015 6:45 AM GMT
అలా అయితేనే ఫ్లైట్ ఎక్కాలంటున్న ఏపీ సర్కారు
X
చేతికి ఎముక లేనట్లు ఖర్చు చేయటంలో ఏపీ సర్కారు తర్వాతే ఎవరైనా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు.. సీనియర్ ఉద్యోగి వరకూ ఖర్చు విషయాల్ని పెద్ద పట్టించుకోరన్నవిమర్శ ఉంది. కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేయటం.. అనంతరం వాటిని వృధా చేయటం మామూలే. హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ కు మెరుగులు దిద్దేందుకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేయటం మొదలుకొని.. విజయవాడ.. విశాఖపట్నం లాంటి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల సమయంలో అయ్యే ఖర్చు.. ప్రత్యేక విమాన ప్రమాణాల భారం లాంటివి చాలానే ఉన్నాయి.

ఓవైపు నిధుల కోసం కటకటలాడుతూనే.. మరోవైపు ఏమీ పట్టనట్లుగా ఖర్చు చేస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న దుస్థితి. ఏమైందో కానీ.. ఇప్పుడిప్పుడే ఖర్చుల మీద ఏపీ సర్కారు దృష్టి సారిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసి ఆంక్షలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి చర్యలు.. అధికారం చేపట్టిన మొదటి రోజే చేపట్టాల్సి ఉంది.

హైదరాబాద్ లో అధికారులు.. బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండటంతో.. ఆయన్ని కలిసేందుకు.. సమీక్షా సమావేశాల కోసం తరచూ హైదరాబాద్.. విజయవాడల మధ్య రాకపోకలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో పలువురు అధికారులు ఎడాపెడా ఫ్లైట్ లలో తిరిగేస్తున్నారు. దీంతో బిల్లులు తడిపి మోపెడు అవుతున్నాయి.

దీంతో.. విమాన ప్రయాణాలకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ సర్కారు. హైదరాబాద్ నుంచి బెజవాడ రానుపోనూ కలిపి రూ.10వేల లోపు అయితేనే విమాన ప్రయాణాలు చేపట్టాలని లేని పక్షంలో కారును ఉపయోగించాల్సింది కోరింది. అంతేకాదు.. ఉన్నతాధికారులు తమతో సిబ్బందిని తెచ్చుకోకూడదని తేల్చి చెప్పింది.

ముఖ్యమంత్రి లేదంటే.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి తప్పించి ఎవరూ తమ వెంట సిబ్బందిని తెచ్చుకోవద్దని.. స్టార్ హోటళ్లలో బస చేయకుండా టూరిజం హోటళ్లలో బస చేయాలని పేర్కొంది. ఇలాంటి పొదుపు చర్యలు ముందే తీసుకొని ఉంటే.. ఈపాటికి కొన్ని కోట్ల రూపాయిలు అయినా ఆదా అయ్యేవి కదా.