Begin typing your search above and press return to search.

రూ.150కోట్లు ఇచ్చేసిన ఏపీ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   17 March 2015 6:14 AM GMT
రూ.150కోట్లు ఇచ్చేసిన ఏపీ ఉద్యోగులు
X
సర్కారు మీద భారం మోపటం మాత్రమే తెలుసున్నట్లుగా వ్యవహరిస్తారన్న అపవాదు ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా తీసుకున్న నిర్ణయంపై పలువురు అభినందిస్తున్నారు. ఈ మాత్రం పెదమనసుతో వ్యవహరించటం మంచిదేనని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రూ.150కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం.. తమ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన నేపథ్యంలో.. అదే రీతిలో ఏపీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. దాదాపు పది నెలల జీతం ఏపీ ఉద్యోగులకు ఏపీ సర్కారు బకాయి పడింది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన బకాయిల్లో యాభై శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు. తమకు రావాల్సిన బకాయిల్లో రూ.150కోట్లను ఏపీ రాజధాని కోసం వెచ్చించాల్సిందిగా వారు కోరారు.

ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఏప్రిల్‌ 6న తిరుపతిలో ఒక సదస్సు ఏర్పాటు చేయాలని.. అందులో ఏపీ అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యంపై చర్చించాలని భావిస్తున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని సత్కరించాలని భావిస్తున్నారు.

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోఉన్నప్పటికీ ఉద్యోగులు అసంతృప్తికి గురి కాకూడదన్న ఉద్దేశ్యంతో.. ఖజానాకు భారం అని తెలిసినా కూడా.. జీతాలు పెంచటానికి రెఢీ అయిన ముఖ్యమంత్రికి ఆ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది..?