Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌, ప‌వ‌న్ వ‌ద్దన్నా ప్ర‌భుత్వం లైట్ తీసుకుంటోంది

By:  Tupaki Desk   |   8 Feb 2017 10:59 AM GMT
జ‌గ‌న్‌, ప‌వ‌న్ వ‌ద్దన్నా ప్ర‌భుత్వం లైట్ తీసుకుంటోంది
X
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్‌ పార్కు నిర్మాణం మ‌రోమారు తెరమీద‌కు వ‌చ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్ర‌ధ‌నాప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు, మిత్ర‌ప‌క్ష నాయ‌కుడైన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతోంది. స్థానికుల వ్యతిరేకతను పట్టించుకోకుండా అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఫ్యాక్టరీ పనులను వేగంగా సాగిస్తోంది. యంత్రాలు అమర్చే ప్రధానమైన ఫ్యాక్టరీ పైకప్పు నిర్మాణ పనులు సైతం చాలావరకూ పూర్తి కావొచ్చాయని స‌మాచారం. ఆక్వా ఫుడ్‌ పార్కు ఏర్పాటుతో తుందుర్రు - జొన్నలగరువు - కంసాలబేతపూడి గ్రామాలతోపాటు భీమవరం - నరసాపురం - పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 36 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చేపల చెరువుల కోసమంటూ భూములు కొనుగోలు చేసి, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఆక్వా ఫుడ్‌ పార్కు పనులను యాజమాన్యం ప్రారంభించింది.

ఆక్వాఫుడ్ పార్కు త‌మ గ్రామాల నడుమ ఫ్యాక్టరీ వద్దంటూ 20కిపైగా పంచాయతీలు తీర్మానాలు చేశాయి. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి 55.50 ఎకరాల్లో ఫ్యాక్టరీని నిర్మించేందుకు పనులు చకచకా నిర్వహిస్తున్నారు. ఏడాదికి 18 వేల టన్నుల రొయ్యల ప్రొసెసింగ్‌ - మూడువేల టన్నుల స్టోరేజీ కెపాసిటీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు చెబుతున్నా.. వాస్తవానికి మరింత ఎక్కువ సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఫ్యాక్టరీకి రోజూ లక్ష లీటర్లు నీరు అవసరం. పంట కాలువల నుంచే ఆ నీటిని తీసుకుంటారు. రోజూ 50 వేల లీటర్లు వ్యర్థ జలాలుగా బయటికి వదులుతారు. ఈ నీరంతా గొంతేరు డ్రెయిన్‌ లో కలవనుంది. దీంతో భీమవరం యనమదుర్రు డ్రెయిన్‌ మాదిరిగా గొంతేరు అవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఫ్యాక్టరీతో గ్రామాలకు గ్రామాలే వల్లకాడుగా మారే ప్రమాదం ఉండటంతో స్థానికులు రాజకీయాలతో సంబంధం లేకుండా రెండున్నరేళ్లుగా పోరాడుతున్నారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. 307 వంటి సెక్షన్లు నమోదు చేసి హత్యాయత్నం చేసినట్టు తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపించింది. వందలాదిమందిపై బైండోవర్‌ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. వ్యర్థ జలాల తరలింపునకు సముద్రం వరకూ పైపులైన్‌ వేస్తామంటూ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కింది. అయితే ఫ్యాక్టరీ నిలుపు చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దని అక్కడి ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.36 గ్రామాల ప్రజలు వద్దంటున్నా ప్రభుత్వం యాజమాన్యానికి అండగా నిలబడి ఆక్వా ఫుడ్‌ పార్కు పనులు ముందుకు సాగిస్తోందని, ఇప్పటివరకూ ఫ్యాక్టరీని తరలిస్తారని ప్రజలు వేచిచూశారు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు అంతిమపోరుకు సిద్ధమవుతున్నామ‌ని స్థానిక పోరాట క‌మిటీ నాయ‌కులు స్ప‌ష్టంచేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/