Begin typing your search above and press return to search.

రైతులను బుగ్గిపాలు చేసిన ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   19 Nov 2018 4:18 PM IST
రైతులను బుగ్గిపాలు చేసిన ఏపీ ప్రభుత్వం
X
2014.. డిసెంబర్ 29... అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా పంటలు సాగుచేసుకుంటున్న రైతుల పొలాలపై పడి కొందరు నాశనం చేశారు. తుళ్లూరు - తాడేపల్లి మండలాల్లో 13 చోట్ల పంటలను తగులబెట్టారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం.. రాజధానికి భూములు ఇవ్వని రైతులను బెదరగొట్టేందుకే టీడీపీ ప్రభుత్వం ఈ పనిచేయించిందని రైతులు ఆరోపించారు. దుమారం రేగడంతో చంద్రబాబు ఈ ఘటనపై స్పందించి విచారణకు ఆదేశించారు.

టీడీపీ కిరాయి గుండాలే ఈ పనిచేశారని అప్పట్లో వైసీసీ ఆందోళనకు దిగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం హడావుడి చేసింది. గుంటూరు జిల్లా - రూరల్ ఎస్పీలను విచారణకు ఆదేశించింది. వారు అసలు నిందితులను కనుగొనే సమయానికి వారిద్దరిని హఠాత్తుగా బదిలీ చేశారు. దీంతో అప్పటి నుంచి కేసు నీరుగారిపోయింది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చావు కబురు చల్లాగా చెప్పింది. కేసులో నిందితులను కనుగొనలేకపోయామని.. అందుకే కేసును క్లోజ్ చేస్తున్నామని నోటీసులను బాధిత రైతులకు తాజాగా పోలీసులు అందజేశారు. కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు బాధిత రైతుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు.

దీంతో రైతులే స్వయంగా కేసును వాపస్ తీసుకున్నట్టు పాత తేదీలతో తయారు చేయించి రైతులతో తాజాగా సంతకాలు తీసుకున్నారట.. హైకోర్టు కెళ్లినా పోలీసుల పక్షాన దెబ్బ పడకుండా ఇలా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధిత రైతులు సోమవారం వివిధ మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాలుగేళ్లు కేసును లాగదీసి తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. తమ పంటలను తగులబెట్టిన టీడీపీ నేతలనే కాపాడేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు.