Begin typing your search above and press return to search.

అమరావతి యాప్:ప్రజలకు కాదు దళారీలకే!

By:  Tupaki Desk   |   7 Oct 2017 10:06 AM IST
అమరావతి యాప్:ప్రజలకు కాదు దళారీలకే!
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాంకేతికత మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ ప్రజలకు అర్థంకాని సంగతులు ఎక్కువవుతూ ఉంటాయి గనుక.. తాము వారికి అర్థ:కానిది ఏం చేసినా సరే.. ఎంతో చేసేస్తున్నట్లుగా ప్రభుత్వం మభ్యపెడుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రభుత్వం తాజాగా అమరావతి యాప్ ను విడుదల చేసింది. అయితే ఇది ప్రజలకు సమాచారం ఇవ్వడానికీ లేదా అమరావతిలో ఏయే పనులు ఏయే దశల్లో ఉన్నాయో పురోగతిని తెలియజెప్పడానికి నమ్మకం కలిగించడానికి ఏర్పాటుచేసిన యాప్ కాదు... అచ్చంగా దళారీలకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం ఏర్పాటుచేసిన యాప్ లాగా కనిపిస్తోంది.

ఈ యాప్ ద్వారా అమరావతికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కొంత అందుబాటులో ఉంటుదని అంటున్నారు. అయితే ఇందులో ఉండేదంతా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. ఏవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. భూముల ధరలెంత? భూయజమానులు ఎవరు? లాంటి వివరాలు అందుబాటులో ఉంటాయిట. అంటే దళారీలు తమ దందాలను ప్రారంభించడానికి ప్రభుత్వం యాప్ ద్వారా ఒక ఏర్పాటును అందుబాటులోకి తెస్తున్నదన్నమాట. దీనితోపాటు అమరావతి కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు ప్రభుత్వం కేటాయించిన భూముల లేఅవుట్లు కూడా ఈ యాప్ లో చూసుకోవచ్చునట.

ఇలాంటి ప్రయత్నం మంచి చెడులను పక్కన పెడితే.. అసలు అమరావతి అంటే ప్రజలు ఏం తెలుసుకోవాలని కోరుకుంటారు? అనే విషయంలో మాత్రం యాప్ రూపకర్తలకు పట్టినట్టు లేదు. అమరావతిలో కనీసం అంతర్గత రోడ్ల నిర్మాణం సాగుతోందా? ఎంతవరకు పనులు జరుగుతున్నాయి. ఏ దశలో ఉన్నాయి. మరో ఏడాదిన్నరలో కోర్ కేపిటల్ పూర్తి చేస్తాం అంటున్నారు కదా.. మరి కనీసం టెండర్లు జరిగితే పనులు ప్రారంభించడానికి సరిపడా ఇన్ ఫ్రా వసతులైనా అక్కడ ఉన్నాయా లేదా? అనే మీమాంస ప్రజలకు ఉంటుంది. ఆ దిశగా వారికి అమరావతి ప్రాంతం గురించి కనీస సమాచారం ఇచ్చేలాగా ఉంటే.. దీనిని కేవలం దళారీలు మాత్రమే కాకుండా.. ప్రజలు కూడా వినియోగించడానికి కొంత అవకాశం ఉండేదేమో అని పలువురు భావిస్తున్నారు.