Begin typing your search above and press return to search.

కరోనా కట్టడికి ఏపీ కీలక నిర్ణయాలు

By:  Tupaki Desk   |   30 March 2020 8:10 AM GMT
కరోనా కట్టడికి ఏపీ కీలక నిర్ణయాలు
X
కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ కేసుల సంఖ్య 20కి చేరువ కావడం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు ప్రజలు వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా కరోనా బాధితులకు సత్వరమే వైద్యం అందుబాటులో ఉంచేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చర్యలు చేపట్టారు. కరోనా అనుమానితులను పరిశీలించడం - అనుమానితులను క్వారంటైన్‌ లో ఉంచేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం సరిపడా వైద్య సౌకర్యాలు ఉన్నా ముందస్తు కోసం రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు - ప్రైవేటు వైద్య కళాశాలలు వినియోగించాలని నిర్ణయించింది. ఆయా ఆస్పత్రులు - కళాశాలల్లో కరోనా చికిత్సకు అందుబాటులో ఉంచాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య సంస్థల నిర్వహణ కలెక్టర్ల ఆధీనంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయ విపత్తుగా కరోనా వైరస్‌ వ్యాప్తిని భారత ప్రభుత్వం ప్రకటించడంతో కరోనా కట్టడికి అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ క్రమంలో కరోనా నివారణకు క్వారంటైన్‌ కేంద్రాలుగా ప్రైవేటు వైద్య కళాశాలలు - ఆస్పత్రులను మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యావసర పరిస్థితుల్లో ఆస్పత్రులోని వైద్య - మౌలిక సదుపాయాలు - వైద్యులు - వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. కరోనా కట్టడికి ఏ వైద్యుల సేవలనైనా వినియోగించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. ఎక్కడైనా.. ఎప్పుడైనా వైద్య నిపుణులు - వైద్యులు - వైద్య సిబ్బంది సేవలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. మొత్తానికి కరోనా కట్టడే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలు కూడా సహకరిస్తే కరోనా తీవ్రం కాదని సీఎం జగన్‌ పేర్కొంటున్నారు.