Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: 29నుంచి విశాఖ నుంచే పాలన?

By:  Tupaki Desk   |   11 Jan 2020 4:50 AM GMT
బ్రేకింగ్: 29నుంచి విశాఖ నుంచే పాలన?
X
అంతా హడావుడి.. అధికారుల ఉరుకులు పరుగులు.. మంత్రుల వరుస భేటీలు.. గుడుపుఠాణిలో ఏవేవో రహస్య చర్చలు.. హైపవర్ కమిటీ సమావేశాలు.. ఏపీకి 3 రాజధానులపై జగన్ సర్కారు ఏదో చేయబోతోంది. ఏపీ సర్కారులో ఏదో జరుగుతోంది. ఈ ఊహాగానాలన్నీ శరవేగంగా జరుగుతున్నాయట...

ఈ నెలాఖరులోగానే 3 రాజధానుల ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో జగన్ సర్కారు వేగంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. అమరావతి రాజధాని మార్పుపై ఇప్పటికే హైపవర్ కమిటీ రెండు సార్లు భేటి అయ్యింది.13న మరోసారి భేటి కాబోతోంది. 20న ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారట.. ఆ తర్వాత కేబినెట్ భేటి నిర్వహించి.. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీ రాజధానిపై తేల్చేసేందుకు జగన్ రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.

వీటికి బలాన్ని ఇచ్చేలా తాజాగా ప్రభుత్వం కీలక పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవుల తర్వాత ఉద్యోగుల ఐచ్చిక వారంతపు సెలవులను జగన్ సర్కారు రద్దు చేయడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. వచ్చే నెలాఖరులోనే ప్రభుత్వం రాజధానిపై తేల్చేసి విశాఖకు మకాం మార్చడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తాలు కూడా చూసినట్టు విశ్వసనీయ సమాచారం.

విశాఖలో ఏపీ రాజధాని పాలన ప్రారంభించడానికి జగన్ సర్కారు ఈనెల 29న ముహూర్తం పెట్టినట్టు సమాచారం. ఆ రోజే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి అధికారికంగా ఆమోదించేసి పాలన చేపట్టడానికి రెడీ అయినట్టు సమాచారం.

అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడం.. చంద్రబాబు జోలెపట్టి అడుక్కుంటుండడం.. ఇలా పరిణామాలు చాలా వేడిగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏకంగా జగన్ రాజధాని మార్చడానికి ముహూర్తం నిర్ణయించడం సంచలనంగా మారింది..