Begin typing your search above and press return to search.

ఏపీ లో మీ బ్యాంక్ ... ?

By:  Tupaki Desk   |   3 Dec 2019 10:28 AM GMT
ఏపీ లో మీ బ్యాంక్ ... ?
X
బ్యాంక్ .. ప్రభుత్వానికి - ప్రజలకి మధ్య వారధి ఈ బ్యాంక్. నిత్యం వేల కోట్ల రూపాయల బిజినెస్ ఈ బ్యాంకుల ద్వారా జరుగుతుంటుంది. ఇక ఒక నెలకి జీతాలు - పెన్షన్లు - సామాజిక పింఛన్లు - సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇలా అన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4.5 కోట్ల మందికి చెల్లింపులు చేస్తోంది. వేతనాలు - పెన్షన్ల కింద మొత్తం రూ.6000 కోట్లు చెల్లింపులు చేస్తుండగా - ఇందులో రూ.2 వేల కోట్లను ఒకటో తేదీనే చెల్లిస్తోంది. వీటిని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - ఆంధ్రా బ్యాంకుల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వం తొలుత ట్రెజరీకి నిధులు బదిలీ చేస్తుంది. అక్కడి నుంచి ఆయా బ్యాంకుల్లోని ఖాతాలకు డబ్బు జమ అవుతుంది. ప్రస్తుతం ఈ విధానం కొనసాగుతుంది.

కానీ , తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సరికొత్త ప్లాన్ ని అమలుచేయబోతుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ..ప్రభుత్వం అమలు చేయబోయే ఈ విధానంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ కాకుండా ఉంటుంది. వారికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించినట్టు అవుతుంది. ప్రభుత్వం ఉద్యోగాలకి జీతం వేయగానే మొత్తాన్ని ఎవరు తీసుకోరు. కానీ - ఆ డబ్బు ఇతర బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల అవి ప్రభుత్వ పరిధిలో లేకుండా పోతున్నాయి. అదే ప్రభుత్వం తరఫున ఒక బ్యాంకు ఏర్పాటు చేసి దాని ద్వారా చెల్లింపులు జరిపితే ఉద్యోగులు డ్రా చేయకుండా ఉంచిన వేతనాల మొత్తం ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. దీనితోనే ప్రభుత్వం మీ బ్యాంక్ కి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది.

ఒక గ్రీన్‌ చానల్‌ పీడీ ఖాతా తరహాలో ‘మీ బ్యాంకు’ను నిర్వహించాలని భావిస్తున్నారు. వేతనాల నిధులతోపాటు సామాజిక పెన్షన్లు - నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల మొత్తాన్ని కూడా ఇదే తరహాలో ప్రతిపాదిత ‘మీ బ్యాంకు’ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే లబ్ధిదారులు ఒకేసారి సంక్షేమ నిధులను డ్రా చేయకుండా... విత్‌ డ్రాయల్‌ పై పరిమితులు విధించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు... అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది. దీనిని ఒకేసారి తీసుకోకుండా - విడతల వారీగా మాత్రమే వాడుకోవాలన్న మాట. లబ్ధిదారులకు ఆధార్‌ - బయోమెట్రిక్‌ అనుసంధానిత ఖాతాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. ఈ విధానం విజయవంతమైతే ఆర్థిక శాఖకు నిధుల లభ్యత పెరుగుతుంది. ఇకపోతే కేరళ ట్రెజరీ బ్యాంకుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అచ్చంగా ఇదే విధానం కాకపోయినప్పటికీ... ఏపీలో ప్రతిపాదిస్తున్న ‘మీ బ్యాంకు’ పనితీరు కూడా కేరళ ట్రెజరీ బ్యాంకు తరహాలో ఉంటుందని సమాచారం.