Begin typing your search above and press return to search.

ఏపీ బొక్క‌సంలో ఉన్న‌ది అంతేనా?

By:  Tupaki Desk   |   30 May 2019 7:26 AM GMT
ఏపీ బొక్క‌సంలో ఉన్న‌ది అంతేనా?
X
మ‌రో రోజు ఆగితే కొత్త నెల వ‌స్తుంది. నెల వ‌చ్చిందంటే.. వెంట‌నే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వాలి. మ‌రి.. ఏపీ ఖ‌జానాలో ఎంత నిధులు ఉన్నాయి? అన్న లెక్క చూస్తే షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. ఇప్ప‌టికిప్పుడు ఏపీ బొక్క‌సంలో ఉన్న‌ది కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు.. పింఛ‌న్లతో పాటు.. విక‌లాంగులు.. వితంతువులు.. వృద్ధులు త‌దిత‌ర వ‌ర్గాల‌కు సామాజిక పింఛ‌న్లు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా క‌లిపితే.. ఇప్ప‌టికిప్పుడు ఏపీకి అవ‌స‌ర‌మైన నిధులు ఏకంగా రూ.5వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి.

మ‌రి.. ఇలాంటివేళ నిధుల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. సామాజిక ఫించ‌న్ల‌కు దాదాపు రూ.1200 కోట్లు అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో..ఇప్పుడు అవ‌స‌ర‌మైన నిధుల కోసం ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యాన్ని వినియోగించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

వాస్త‌వానికి ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఆరంభం నుంచే ఓవ‌ర్ డ్రాఫ్ట్ తోనే ప్రారంభ‌మైంది. అన్న‌దాతా సుఖీభ‌వ.. ప‌సుపు కుంక‌మ చెల్లింపులు లాంటివి చెల్లించ‌టంతో ఖ‌జానా మొత్తం ఖాళీ అయ్యే ప‌రిస్థితి. కొన్ని బ్యాంకుల నుంచి రుణ స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో బ‌హిరంగ మార్కెట్ రుణ మొత్తాల‌ను ఈ ప‌థ‌కాల కోసం మ‌ళ్లించారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓవ‌ర్ డ్రాఫ్ట్ మిన‌హా మ‌రో మార్గం లేని ప‌రిస్థితి. అయితే.. దీంతో వ‌చ్చే ఇబ్బందేమంటే.. నెల‌లో నిర్దుష్టంగా కొన్ని రోజుల‌కు మించి ఓవ‌ర్ డ్రాఫ్టులో ఉంటే రిజ‌ర్వు బ్యాంకు ఎలాంటి హెచ్చ‌రిక‌లు లేకుండా చెల్లింపులు నిలిపివేసే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో ఓవ‌ర్ డ్రాఫ్ట్ వినియోగంలోనూ ఆచితూచి అన్న‌ట్లుగాగా వ్య‌వ‌హ‌రించాల్సిందే.

ఎందుకీ ప‌రిస్థితి అంటే.. బ‌డ్జెట్ కు త‌గ్గ‌ట్లు ఖ‌ర్చులు ఉంటే ఇబ్బంది ఉండ‌దు. కానీ.. సంక్షేమ ప‌థ‌కాలు.. జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల పేరుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఖ‌ర్చులు ఉండ‌టంతో తాజా ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌తి నెలా రాష్ట్ర ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లు ఓపెన్ మార్కెట్ రుణాల‌ను రిజ‌ర్వు బ్యాంకు నుంచి తీసుకుంటున్నారు.రాష్ట్ర ప్ర‌భుత్వ సెక్యురిటీలు త‌న‌ఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలి మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో రూ.8వేల కోట్లు రుణాలు తెచ్చుకునేందుకు రిజ‌ర్వ్ బ్యాంకు అనుమ‌తి ఇస్తే.. ఏప్రిల్ లోనే రూ.5వేల కోట్ల‌ను రుణం తీసుకొని నాటి అవ‌స‌రాల‌కు వాడేశారు. ఈ నెల మొద‌ట్లో మ‌రో రూ.2వేల కోట్లు రుణం తీసుకొని ఖ‌ర్చు చేశారు. ఇటీవ‌ల కాలంలో ఏ నెల‌కు ఆ నెల జీతాల స‌ర్దుబాటు.. సంక్షేమ ప‌థ‌కాలకు కేటాయింపుల‌తో స‌రిపుచ్చుతూ.. బిల్లుల చెల్లింపుల‌కు వాయిదా వేస్తున్నారు. అయితే.. ఈ నెలాఖ‌రులో మాత్రం జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు చెందిన బిల్లుల చెల్లింపు వివాదంగా మారింది. ఎంతో అనుభ‌వం ఉన్న పాల‌కుడిగా పేరున్న చంద్ర‌బాబు హ‌యాంలో.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉండ‌టంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రి.. ఈ దారుణ ప‌రిస్థితిని జ‌గ‌న్ ఏ విధంగా స‌ర్దుబాటు చేస్తారో చూడాలి.