Begin typing your search above and press return to search.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్థం: ఆర్బీఐ

By:  Tupaki Desk   |   8 Feb 2018 7:55 AM GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్థం: ఆర్బీఐ
X

లోటు బ‌డ్జెట్ తో ప్రారంభ‌మైన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాణం ఆర్థికంగా ఒడిదుడుకుల‌తోనే కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని ఆర్బీఐ హెచ్చ‌రిస్తోంది. గ‌త రెండు మూడు నెల‌లుగా రాష్ట్ర ఖజానా ఓవ‌ర్ డ్రాఫ్ట్ (ఓడీ)లో పడిపోవ‌డం ఆర్థిక నిపుణుల‌తో పాటు ఆర్బీఐని కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది. రాష్ట్రంలో అరుదుగా క‌నిపించే ఓడీ ఇపుడు రెండు నెల‌ల‌కోసారి క‌నిపించ‌డంతో ఆర్బీఐ....ఏపీకి ముందస్తు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తాజాగా ఏపీకి దాదాపు రూ.1563 కోట్ల రూపాయల వరకు ఓడీ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, జనవరి 2వ తారీకున ఏపీ ఓడీకి వెళ్లింది. డిసెంబర్ నెలలో ఓడీ ఉన్న‌ప్ప‌టికీ అది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతుంద‌ని అనుకున్నారు. అటువంటిది జ‌న‌వ‌రి - ఫిబ్రవరి లో కూడా ఓడీకి వెళ్లాల్సి రావడంతో ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త 3 నెలలలో ఏపీ 13 రోజులు ఓడీలో ఉంది. 33 రోజుల్లో 13 రోజులు రాష్ట్రం ఓడీలో కొనసాగడం....ఆర్థిక దుస్థితికి అద్దం ప‌డుతోంది. అదే మ‌రొక్క రోజు ఏపీ ఓడీలో కొన‌సాగి ఉంటే ప‌రిస్థితి మ‌రింత అధ్వాన్నంగా ఉండేది. నానాటికీ ఏపీలో ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారిపోతోంద‌న‌డానికి ఇదే నిద‌ర్శనం. వ‌రుస‌గా 14 రోజులపాటు ఒక రాష్ట్రం ఓడీలో ఉంటే స‌ద‌రు రాష్ట్రానికి విడుద‌ల కావాల్సిన కొన్ని ర‌కాల నిధులను ఆర్బీఐ నిలిపివేసే అధికారం ఉంది. అంతేకాకుండా, వరుసగా 5 పనిదినాలు సాధారణ వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్ ను అధిగమించకూడద‌ని ఆర్బీఐ నిబంధ‌న‌లు చెబుతున్నాయి. 3నెలల వ్యవధిలో(ఒక క్వార్ట‌ర్ లో) 36 రోజలపాటు వేస్‌ అండ్‌ మీన్స్ కు వెళ్లకూడదు. ఇప్పటి వరకు ఏపీ వరుసగా 4 పనిదినాల్లో ఓడీకి వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతోపాటు 13 రోజులు ఓడీలో ఉంది. ఈ లెక్క‌న ఇప్ప‌టికే ఏపీ 33 రోజుల్లోనే 13 రోజులు ఓడీలో కొన‌సాగింది. ఇక ఈ త్రైమాసికంలో మిగిలిన 55-57 ప‌నిదినాల్లో 23 రోజులపాటు ఏపీ స‌ర్కార్ ఓడీలోకి వెళ్ల‌కుండా ఉంటుందా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి కొద్ది రోజుల్లో ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఏపీ కొత్త అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉంది. ఓ వైపు ఓడీలోకి వెళ్ల‌కుండా ఆర్థిక‌ సవాళ్లను ఏపీ ఏ విధంగా అధిగమిస్తుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఏదేమైనా బాబు స‌ర్కార్ ప‌రిస్థితి ముందు నుయ్యి....వెనుక గొయ్యి అన్న చందంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.