Begin typing your search above and press return to search.

ఏపీ ఫైబర్ నెట్‌ తో ఎంత లాభం?

By:  Tupaki Desk   |   28 Dec 2017 5:00 AM IST
ఏపీ ఫైబర్ నెట్‌ తో ఎంత లాభం?
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - ఐటీ మంత్రి లోకేశ్‌ లు ఊదరగొడుతున్న ఏపీ ఫైబర్ నెట్ వల్ల మారుమూల ప్రాంతాలకు నెట్ సదుపాయం రావడమన్నది మంచి ప్రయోజనకర అంశమే కానీ - ఆ ధరకు ఏమంత గొప్ప సదుపాయం కాదన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ముఖ్యంగా జియో - ఎయిర్‌ టెల్ వంటివి మొబైల్ ఇంటర్నెట్‌ ను నెలకు ఇంతకంటే తక్కువ మొత్తంలో - ఇంతకంటే ఎక్కువ డాటా లిమిట్‌ తో ఇస్తున్నాయి. జియోనే తీసుకుంటే రూ.349తో రీచార్జి చేయించుకుంటే సుమారు మూడు నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ - మెసేజెస్ ఇవ్వడమే కాకుండా రోజుకు 1 జీబీ అంటే నెలకు 60 జీబీ డాటా కూడా వస్తుంది. పైగా 4జీ సేవలు. ఇక ఎయిర్‌ టెల్ కూడా రూ.399తో రీచార్జి చేసుకుంటే 70 రోజులు.. అంటే రెణ్నెల్లకు పైగా కాలానికి రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ - ఇంకా ఫ్రీ కాల్స్ - మెసేజెస్ ఇస్తోంది.

ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఫైబర్ నెట్ డాటా ప్యాకేజీలు చూసుకుంటే... నెలకు రూ.149 ధరకు అందిస్తున్నది బేసిక్ ప్యాకేజీ. ఇందులో 250 టీవీ చానళ్లు ఫ్రీగా చూసుకునేలా కేబుల్ టీవీ సర్వీస్ ఉంటుంది. దాంతో పాటు ఒక ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ ఇస్తారు. ఇక ఇంటర్నెట్ విషయానికొస్తే 15 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. నెలకు కేవలం 5జీబీ డాటా లిమిట్ మాత్రమే ఉంటుంది. ఇంతేవేగంతో డాటా లిమిట్ పెంచుకోవాలనుకుంటే 25 జీబీ కోసం రూ.399... 50 జీబీ కోసం రూ.599 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఆఫీసులకిచ్చే కనెక్షన్లకు 100 ఎంబీపీఎస్ వేగం ఇస్తున్నా డాటా లిమిట్ 50 జీబీ మాత్రమే. 100 ఎంబీపీఎస్‌ తో పనిచేసేటప్పుడు 50 జీబీ చాలావేగంగా అయిపోతుంది. పైగా ఈ కనెక్షన్‌కు నెలకు రూ.999 చెల్లించాలని చెబుతున్నారు.

ఇక ఇళ్లకు ఇచ్చే కనెక్షన్ల గురించి మాట్లాడుకుంటే ఇందుకు అవసరమయ్యే సెట్ టాప్ బాక్సుల గురించే మాట్లాడుకోవాలి. కనెక్షన్‌కు నెలకు రూ.149 మాత్రమే ఇస్తున్నా రెండు సెట్ టాప్ బాక్సుకు రూ.4 వేలు చెల్లించాలి. ఒకేసారి చెల్లించలేకపోతే నెలకు రూ.99 చొప్పున నాలుగేళ్లపాటు చెల్లించాలి. అంటే ఎంతవుతుందో లెక్కేసుకోవచ్చు. నెలకు లెక్కేసుకున్నా రూ.149 + రూ.99 కలిపి నెలకు రూ.248 చెల్లించాలి. అప్పుడు నాలుగేళ్ల పాటు కచ్చితంగా నెలనెలా ఈ మొత్తం కట్టాల్సిందే. అంటే టీవీ ఛానళ్ల కోసం మీరు అదనంగా నెలకు 99 ఇస్తున్నట్లు లెక్క. మరి.. ప్రైవేటు కేబుల్ ఆపరేటర్లు ఛార్జి చేస్తున్నది కూడా అంతే. ఒక్కో చోట పోటీని బట్టి ఇది రూ.100 నుంచి రూ.150 మధ్య ధరలో ఉంటుంది. వారు అందించే ఛానళ్లు 500కిపైగా ఉంటాయి.

మరి.. ఇంటర్నెట్ అందించే సంస్థల ప్యాకేజీలు ఎలా ఉన్నాయో అది కూడా చూద్దాం. ఈ రంగంలో ఏపీలో ప్రధాన సంస్థలు హాత్‌వే, యాక్ట్ నెట్వర్కులనే తీసుకుందాం. హ్యాథ్‌ వే ఎక్కువ వేగమున్న బ్రాడ్ బాండ్ సేవలందిస్తుంది. 50 ఎంబీపీఎస్ స్పీడు - 100 జీబీ డాటా లిమిట్‌ను ఇది సుమారు రూ.600కే అందిస్తోంది. యాక్ట్‌ బేసిక్ ప్లాన్ 20 ఎంబీపీఎస్ వేగం, 150 జీబీ డాటా లిమిట్.. ఇది రూ.549కే దొరుకుతుంది. కానీ... ఏపీ ఫైబర్ నెట్లో 15 ఎంబీపీఎస్ స్పీడు, 50 జీబీ డాటా లిమిట్ కావాలంటే రూ.599 అవుతుంది.

కొన్ని పట్టణాల్లో లోకల్ కేబుల్ ఆపరేటర్లు కొందరు ఇప్పటికే కేబుల్ టీవీ - ఇంటర్నెట్ కలిపి అందిస్తున్నారు. అందులో ధరలు ఇదే స్థాయిలో ఉంటున్నాయి. సో... ఇవన్నీ లెక్కేస్తే ఏపీ ప్రభుత్వం ప్రజలకు కొత్తగా ఏమిస్తోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. కేవలం రూరల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఒక్కటే అందరూ పెట్టుకున్న ఆశ. కానీ.. ప్రస్తుతం ఈ పథకం గుంటూరు - కృష్ణాజిల్లాలకే పరిమితమైంది. ఎప్పుడు మారుమూల ప్రాంతాలకు చేరుతుందో తెలియదు. చేరినా... అంతరాయాలు లేకుండా ఈ వేగంతో సేవలందుతాయో లేదో చూడాలి.