Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షం కాస్త కుదుట‌ప‌డుతోంది

By:  Tupaki Desk   |   21 Nov 2016 5:30 PM GMT
ప్ర‌తిప‌క్షం కాస్త కుదుట‌ప‌డుతోంది
X
కొద్దికాలంగా వార్త‌ల‌ను గ‌మ‌నిస్తే... కాంగ్రెస్ పార్టీ త‌న‌దైన శైలిలో కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఏపీలో అడ్రస్‌ గల్లంతయ్యే పరిస్థితిని ఎదుర్కొన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకొనేందుకు ప్రజా ఉద్యమాల బాట పడుతోంది. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై నిత్యం జనంలోకి వెళ్లడం ద్వారా తిరిగి తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్ తో స‌మానంగా ముందుకు సాగేందుకు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ప్రజా సమస్యలపై స్పందిస్తోందని రాజకీయ వర్గాల విశ్లేషణ. తద్వారా తన ఉనికిని తిరిగి కాపాడుకొనే ప్రయత్నాలను ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం చేపట్టిందని అంటున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పార్టీ ఉనికినే కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ తిరిగి కోలుకొనేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. పలు ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన హామీలు అమలు, ఏపీకి ప్రత్యేక హోదాపై నిరంతరం ఏపి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం గళం విప్పింది. రాజ్యసభలో ఆ పార్టీ సీనియర్‌ నేత - ఎంపీ కేవీపీ రామచంద్రరావు పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంలోని ఎన్‌ డిఏ సర్కార్‌ను నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వం పలు రూపాల్లో ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటంతోనే రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్షాలు ఉద్యమ కార్యచరణలోకి దిగాయని చెప్పవచ్చు. ఈ పోరాటంతో జనం మద్దతు కూడగట్టుకొన్న కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో జరిగిన తొలి ఉప ఎన్నిక అయిన నందిగామా ఉప ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్‌ దక్కించుకోగలిగింది. తద్వారా కాంగ్రెస్‌ పార్టీకి జనం మద్దతు పెరుగుతోందన్న సంకేతాలను ఆ పార్టీ పంపింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని ప్రతిపక్షాల కంటే ఒక అడుగు కాంగ్రెస్‌ పార్టీ ముందుకేసి గళం ఎత్తింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులనిర్మాణంతో ఏపికి అందులోనూ రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రైతు - డ్వాక్రా గ్రూపుల రుణ మాఫి అంశం, ఇంటికో ఉద్యోగం వంటి టిడిపి ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్‌ పార్టీ గళం ఎత్తింది. ఇటీవల కర్నూలు జిల్లాలో ఇందిరాగాంధీ జయంతిని పురష్కరించుకొని రైతుల సభను నిర్వహించింది.

ఏపీలో టీడీపీ సర్కార్‌ వచ్చాక ఎన్నో ప్రజా సమస్యలు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర విభజన బిల్లులోని హామీల అమలు, ఏపికి ప్రత్యేక హోదా అన్నది ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి. ఈ విషయాలన్నింటిపైనా గళం ఎత్తిన కాంగ్రెస్‌ పార్టీ కొంతమేర జనం మద్దతు సంపాధించిందని రాజకీయ వర్గాల అంచనా. అయితే వాస్తవానికి దక్కాల్సిన క్రెడిట్‌ మాత్రం దక్కడంలేదని, దీనికి రాష్ట్ర విభజన అపవాదు ఆ పార్టీపై ఉండటమేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్‌ నేతలు సైతం అంతర్గతంగా ధృవీకరిస్తున్నారు. ఏపీ కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ రెండుగా చీల్చిందన్న కోపాన్ని ఇప్పటికీ ఏపీ ప్రజానికం జీర్ణించుకోవడంలేదని కాంగ్రెస్‌ పార్టీవర్గాలే ధృవీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అపవాదు నుంచి ఎలా బయటపడాలి అన్న దానిపై ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నిర్ణయంతో నైరాశ్యం చెందిన ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రస్తుతం పార్టీ నాయకత్వం పోరాట చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇదే దూకుడును పార్టీ నాయకత్వం కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా తమ పార్టీకి పూర్వ స్థితి తిరిగి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/