Begin typing your search above and press return to search.

ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ జగనేనంట

By:  Tupaki Desk   |   26 Aug 2015 5:43 AM GMT
ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ జగనేనంట
X
రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీలో పాతాళంలోకి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కోలుకోవటానికి కిందామీదా పడుతోంది. పార్టీకి పునర్ వైభవం సంగతి తర్వాత.. మొదట బతికి బట్టకడితే చాలన్నట్లుగా ఉంది వ్యవహారం. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా రోడ్ల మీదకొచ్చి వీరంగం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.

నేతల ఆరాటం తప్పించి.. ప్రజల్లో పార్టీ పట్ల ఏ మాత్రం నమ్మకం లేకపోవటం ఒక పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. దీనికితోడు.. ఏపీలో జగన్ పార్టీ అనుసరిస్తున్న విధానం వల్ల తమకు మొత్తంగా దెబ్బ పడే అవకాశాన్ని ఈ మధ్యనే గుర్తించిన కాంగ్రెస్.. అధికారపక్షం కంటే ముందు.. ప్రధాన విపక్షం మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

విమర్శకులు తరచూ వ్యవహరించే పిల్ల కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ కాదని.. తల్లి కాంగ్రెస్ బలిని కోరుకుంటుందంటూ ఏపీకి చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించటం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతుందంటున్నారు.

జగన్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ కు చెక్ పెట్టాలని లేకుంటే.. ఏపీలో కాంగ్రెస్ ఉనికి అంటూ లేకుండా ఫోతుందని.. తనకు సంప్రదాయంగా వస్తున్న రెడ్లు.. దళిత ఓటు బ్యాంక్ మొత్తంగా జగన్ పార్టీకి బదిలీ కావటం ఖాయమని మాట వినిపిస్తోంది. మరికొద్ది నెల్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా జగన్ పార్టీలోకి వచ్చేస్తున్నారని.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదంటూ చేస్తున్న ప్రచారం.. పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చనుందన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి వెళ్లిందట.

ఇక.. ఏపీలో క్రౌడ్ ఫుల్లింగ్ నేతగా పేరొందిన చిరంజీవి ఇప్పట్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశమే లేదని.. ఆయనిప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని.. సినిమాల ద్వారా ఇమేజ్ బిల్డింగ్ చేసుకొని.. ఎన్నికల ముందు రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారిస్తారన్న మాట వినిపిస్తోంది. దీంతో.. పిల్ల కాంగ్రెస్ చేస్తున్న మైండ్ గేమ్ కు ఎప్పటికప్పుడు చెక్ పెట్టేందుకు వీలుగా.. అధికారపక్షంతో పాటు.. విపక్షంపై కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తంగా అధికారపక్షం కంటే కూడా.. విపక్షమే తమ ప్రధాన ప్రత్యర్థి అన్న మాట ఏపీ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.