Begin typing your search above and press return to search.

తిరుమలలో మళ్లీ ఆ పద్దతికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్!

By:  Tupaki Desk   |   13 Sep 2020 5:10 AM GMT
తిరుమలలో మళ్లీ ఆ పద్దతికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్!
X
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటూ ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో ఉంటారు. జగన్ ‌తో పాటూ తిరుమలకు కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా తిరుమలకి రానున్నారు. ఈ నెల 23న తిరుమల చేరుకోనున్న జగన్.. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపనలో సీఎం జగన్, యడియూరప్పలు పాల్గొనున్నారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోని అల్పాహారం స్వీకరించి జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

అయితే , తండ్రి వై ఎస్ ఆర్ , చంద్రబాబు నాయుడు , కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్య వంటి నేతలు పక్కన పెట్టిన పాత సంప్రదాయం ప్రకారమే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నిజానికి- గరుడ సేవ నాడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. 2003 నాటి బ్రహ్మోత్సవాలకు ముందు చంద్రబాబు సహా అందరు ముఖ్యమంత్రులూ గరుడ వాహనం నాడే ఏడుకొండలవాడికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. 2003లో ఈ విధనానికి బ్రేక్ పడింది. దీనికి కారణం- అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సలైట్లు దాడి. ఈ ఘటన తరువాత.. గరుడసేవ నాడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే తేదీలో మార్పు చోటు చేసుకుంది.

గరుడ వాహనం నాడు కాకుండా.. ధ్వజారోహణం నాడే స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు అదే సంప్రదాయాన్ని అనుసరించారు. గత ఏడాది వైఎస్ జగన్ కూడా దాన్ని కొనసాగించారు.

ఈ సారి దీనికి భిన్నంగా పాత సంప్రదాయం ప్రకారం.. గరుడసేవ నాడు వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, 23న ఆయన తిరుమలకు వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే ఈసారి శ్రీవారి బ్రహోత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.