Begin typing your search above and press return to search.

కేసు పెడితే ఏమిటన్న దానిపై క్లారిటీ లేదా?

By:  Tupaki Desk   |   10 Jun 2015 5:26 AM GMT
కేసు పెడితే ఏమిటన్న దానిపై క్లారిటీ లేదా?
X
రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ''బాస్‌'' ఎవరో తేల్చేశామని తెలంగాణ ఏసీబీ అధికారులు చెప్పేస్తున్నారు. మరి.. బాస్‌ఎవరో చెప్పేసిన తర్వాత సదరు బాస్‌ మీద కేసు నమోదు చేయటం.. ఆ కేసులో చేర్చటం లాంటివి మామూలుగా జరిగిపోయే అంశాలు.

అయితే.. ఆ బాస్‌ అన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతవరకూ టార్గెట్‌ రేవంత్‌రెడ్డి అన్నట్లుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు అందుకు భిన్నంగా బాబు దిశగా అడుగులు పడుతున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసు పెడితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

మరి.. దీనిపై ఏపీ సర్కారు ఏం ఆలోచిస్తుంది.. ఇలాంటి పరిణామం చోటుచేసుకుంటే తదనంతరం ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఏం ఆలోచించిందన్న అంశంపై దృష్టి పెడితే.. కాస్తంత ఆశ్చర్యం కలగకమానదు.

ఊహించని విధంగా వ్యవహరిస్తూ.. షాకుల మీద షాకులిస్తూ.. అంతు చూడటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న తమ రాజకీయ ప్రత్యర్థులకు ధీటుగా బదులిచ్చేందుకు పక్కా ప్రణాళిక అవసరం అన్న వాదన వినిపిస్తున్న క్రమంలో.. రేవంత్‌ కేసులో చంద్రబాబు పేరును నమోదు చేస్తే ఏం చేయాలన్న అంశంపై ఏపీ మంత్రివర్గం చేసిన ఆలోచన ఏమిటన్నది చూస్తే కాస్తంత విస్మయం కలగక మానదు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్రానికి కేసు నమోదు చేసే అవకాశం ఉండదని.. అలాంటిది సాధ్యం కాదని.. ఆ పని చేస్తారని అనుకోవటం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటం కాస్తంత ఆశ్చర్యం కలిగించే అంశం. కేసు నమోదుకు యాక్షన్‌ ప్లాన్‌ ఏమిటన్న దానిపై దృష్టి పెట్టేకన్నా.. అలాంటి పరిస్థితి రాదు.. ఒకవేళ వస్తే.. మరోమారు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకుందామని నిర్ణయం తీసుకోవటం చూసినప్పుడు.. బాబు ప్లానింగ్‌ మరీ ఇంత పూర్‌గా ఉందన్న భావన కలగటం ఖాయం.