Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ గారూ... అసెంబ్లీ వ‌ద్ద ఏర్పాట్లే ఇలేగేనా?

By:  Tupaki Desk   |   6 March 2017 5:43 AM GMT
స్పీక‌ర్ గారూ... అసెంబ్లీ వ‌ద్ద ఏర్పాట్లే ఇలేగేనా?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు నూత‌న అసెంబ్లీ అందుబాటులోకి వ‌చ్చేసింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజధాని లేకుండానే ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌కు గుంటూరు జిల్లాలో మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ప‌లు గ్రామాల‌ను క‌లిపేసుకుని, దానికి అమ‌రావ‌తి అని పేరు పెట్టేసిన చంద్రబాబు స‌ర్కారు దానినే న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించేసింది. ఆ ప్రాంతంలోని వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌యాన్ని నిర్మించిన ప్ర‌భుత్వం... తాజాగా అసెంబ్లీ - శాస‌న‌మండ‌లి భ‌వ‌న స‌ముదాయాల‌ను కూడా నిర్మించేసింది. ఇది కూడా తాత్కాలిక భ‌వ‌న స‌ముదాయ‌మేన‌ట‌. కొత్త రాజ‌ధానిలో అన్నీ ఒకే సారి అందుబాటులోకి రావ‌న్న విష‌యాన్ని అంగీక‌రించినా... విడ‌త‌ల వారీగానే ఏర్పాట‌వుతున్న భ‌వ‌నాల్లో ప్ర‌భుత్వం అందుబాటులోకి తెస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తే మాత్రం షాక్ తిన‌క త‌ప్ప‌దు. తాత్కాలిక భ‌వ‌నాలే అయిన‌ప్ప‌టికీ... చంద్ర‌బాబు సర్కారు వంద‌లాది కోట్ల రూపాయాల‌ను వెచ్చిస్తున్న వైనంపై ప‌లు వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ప్ర‌భుత్వం మాత్రం వాటిని ప‌ట్టించుకుంటున్న దాఖ‌లా ప‌డ‌టం లేదు.

ప్ర‌భుత్వం తాను అనుకున్న రీతిలోనే భ‌వ‌నాలు - వాటిలో ఏర్పాట్ల‌ను చేస్తోంద‌న్న వాద‌న కూడా ఇటీవ‌ల బాగా ప్ర‌చారంలోకి వ‌స్తోంది. ఇదివ‌ర‌కే అందుబాటులోకి వ‌చ్చిన స‌చివాల‌యం విష‌యానికే వ‌స్తే... భ‌వ‌నం లోప‌ల ఉన్నంత వ‌ర‌కే ఇబ్బంది లేదు. అయితే భ‌వ‌నం త‌లుపు దాటి బ‌య‌ట‌కు వ‌స్తే.. ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించ‌క మాన‌వు. ఎందుకంటే... భ‌వ‌నం బ‌య‌ట ఎలాంటి ఏర్పాట్లు లేవు. భ‌వ‌నం బ‌య‌ట కాలుపెడితే.. నేరుగా భానుడి దెబ్బ‌కు గురి కాక త‌ప్ప‌దు. వ‌ర్షం ప‌డినా కూడా త‌డిసి ముద్ద కావ‌డం ఖాయం. ఇక ఈ నెల 2న ప్రారంభ‌మైన అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయంలోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాదులోని అసెంబ్లీలో అన్ని సౌక‌ర్యాలు ఎక్క‌డిక‌క్క‌డ ప‌క‌డ్బందీగా ఉన్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. అయితే వెల‌గ‌పూడి అసెంబ్లీలో మాత్రం ఈ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో కూడిన ఏర్పాట్లు క‌నిపించ‌వు. అసెంబ్లీ భ‌వ‌నం బ‌య‌ట కాలు పెడితే... నేరుగా సూర్య ప్ర‌తాపం కింద‌కు వ‌చ్చేసిన‌ట్లే లెక్క‌.

అసెంబ్లీ స‌మావేశ మందిరం విశాలంగానే ఉన్నా లాబీలు మాత్రం చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఈ క్ర‌మంలో మీడియాకు లాబీ పాసులు ఇచ్చే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. మీడియాకు పాసుల సంగ‌తి ఎలా ఉన్నా... స‌భ‌కు వ‌చ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాస్తంత సేద‌దీరుదామంటే మాత్రం అందుకు త‌గ్గ ఏర్పాట్లేమీ లేవు. ఏదో స్కూలుకు వ‌చ్చిన పిల్ల‌లా.. స‌మావేశాల‌కు వ‌చ్చే స‌భ్యులు నేరుగా స‌మావేశ మందిరంలోకి వెళ్ల‌డం, స‌మావేశాలు ముగియ‌గానే... నేరుగా బ‌య‌ట‌కు వ‌చ్చి కారెక్కేయ‌డం మిన‌హా పిచ్చాపాటిగా మాట్లాడుకునే అవ‌కాశం లేద‌నే చెప్పాలి. ఇక అసెంబ్లీ వ‌ద్ద మీడియాతో మాట్లాడాలంటే స‌భ్యులకు చుక్క‌లు క‌నిపించ‌క మాన‌వు. ఎందుకంటే... అసెంబ్లీ భ‌వ‌నానికి అల్లంత దూరంలో మీడియా పాయింట్ ను ఏర్పాటు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెప్పొచ్చు. స‌భ్యుల సంగతి ఎలా ఉన్నా... వారి మాట‌ల‌ను రిపోర్టు చేసే బాథ్య‌త‌లు తీసుకున్న మీడియా ప్ర‌తినిధులు మాత్రం భానుడి ప్ర‌తాపం కింద మాడిపోవాల్సిందే. అసెంబ్లీ భ‌వ‌నం లోప‌ల సౌక‌ర్యాలు అహో అన్న రీతిలో ఉన్నా... బ‌య‌ట మాత్రం అస‌లు ఏర్పాట్లే చేయ‌లేద‌న్న మాట వినిపిస్తోంది. అంటే... అసెంబ్లీ వ‌ద్ద‌కు వెళ్లాల‌ని అనుకుంటే... ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌తో వెళ్ల‌క‌పోతే... ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/