Begin typing your search above and press return to search.

ఏపీ నేతల మాటలు రోత పుట్టిస్తున్నాయ్

By:  Tupaki Desk   |   15 March 2016 10:14 AM IST
ఏపీ నేతల మాటలు రోత పుట్టిస్తున్నాయ్
X
సోమవారం ఏపీ అసెంబ్లీ సాగిన తీరు చూస్తే చిరాకు పుట్టటం ఖాయం. ప్రజా ప్రయోజనాల్ని పక్కన పెట్టేసి రాజకీయంగా అధికార.. విపక్ష పార్టీలు వ్యవహరించిన తీరు చిరాగ్గా ఉండటమే కాదు.. వారి మాటలు.. చేసుకున్న విమర్శలు హద్దులు దాటిన వైనం స్పష్టంగా కనిపించింది. మొండితనం.. ఎంతకూ తగ్గని వైనం.. ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ఎక్కువన్న విషయం సోమవారం ఏపీ అసెంబ్లీని చూసినోళ్లకు ఇట్టే అర్థం కాక మానదు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. విస్మయాన్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం.

‘‘నువ్వు మగాడివైతే.. దమ్ముంటే.. నీలో ఉంది రాయలసీమ రక్తమే అయితే..’’ అంటూ విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడితే.. ‘‘కోర్టులను మేనేజ్ చేసి తీర్పులు తెప్పించేసుకున్నాడు’’ అంటూ జగన్ తన హద్దుల్ని పూర్తిగా దాటేసి వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ఈ క్రమంలో.. ‘‘కొవ్వు పట్టింది’’.. ‘‘మగాడివైతే’’.. ఇలాంటి మాటలు పలు సందర్భాల్లో కోకొల్లలుగా ఒకరిని ఒకరు అనుకోవటం కనిపించింది.

రాజకీయ అధిక్యం కోసం.. పైచేయి కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నట్లు కనిపించిందే తప్పించి.. ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యల్ని అసెంబ్లీ చర్చించే ఉద్దేశం ఏ మాత్రం కనిపించని దుస్థితి. మాటలతో పైచేయి సాధించాలని అనుకోవటం.. ఆధారాలు చూపించకుండా ఇష్టారాజ్యంగా విమర్శలుచేసిన వైనం విపక్ష నేత వైఎస్ జగన్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. రాజకీయ వ్యాఖ్యలతో సభను హాట్ గా మార్చేసిన నేతలు.. ఎక్కడా కూడా ప్రజా సమస్యలు.. వాటి పరిష్కారాల గురించి ఏమాత్రం ఆలోచించినట్లుగా కనిపించలేదనే చెప్పాలి. సోమవారంఏపీ అసెంబ్లీ సమావేశాల్నిటీవీల్లో చూస్తున్న వారిలో చాలామందికి ఏపీ అధికార.. విపక్ష నేతల వైఖరి రోత పుట్టించిందనటంలో ఎలాంటి సందేహం లేదు.