Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   17 Dec 2015 12:13 PM IST
అసెంబ్లీలో ఏం జరుగుతోంది?
X
ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలసిందే. రాష్ట్రంలో కల్తీ మద్యం - కాల్‌ మనీ వంటి కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సజావుగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు. అనుకున్నట్లుగానే సభలో గందరగోళం తలెత్తడంతో రెండుసార్లు వాయిదా పడి మూడోసారి మళ్లీ మొదలైంది.

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చారు. సెక్స్‌ రాకెట్‌ లో కూడా టీడీపీ నేతల ప్రమేయం ఉందని, ఈ కేసును డైవర్ట్‌ చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా దాడుల నాటకానికి తెరలేపారని జగన్ ఆరోపించారు. శాసనసభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మరో వైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కాల్‌ మనీ వ్యవహారంపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది.

కాల్‌ మనీపై సభలో ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేస్తుందని ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాల్‌మనీ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో చర్చలో తేలుతుందని అన్నారు. అనంతరం చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఆందోళన చేయడంతో శాసనసభ దద్దరిల్లిపోయింది. కాల్‌ మనీ వ్యవహారంపై వైసీపీ సభ్యులు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ సభ్యులంతా పోడియం చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానం చేపట్టాల్సిందేనంటూ డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో శాసనసభ వాయిదా పడింది. పది నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేస్తూ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రకటించారు. ఆ తరువాత సభ మళ్లీ మొదలైంది.. కాల్‌ మనీ వ్యవహారంపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టుతూ వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగించడంతో సభను హోరెత్తించారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ రేపు చర్చ చేపడుతామని చెప్పాక కూడా సభ కార్యక్రమాలకు అడ్డుతగలడం సరికాదన్నారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరినా ఫలితం లేకపోవడంతో సభను వాయిదా వేశారు.

కాగా అంబేద్కర్‌ ను ప్రతిపక్షం అవమానిస్తోందని మంత్రి రావెల కిశోర్‌ బాబు అన్నారు. ఈ రోజు అసెంబ్లి సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలపై చర్చకు ఆమోదించాక సభను అడ్డుకోవడం సరికాదని అన్నారు. సభ గందరగోళం సృష్టించడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. కాల్‌ మనీ కేసులో వైసీసీ నేతలే నిందితులు కాబట్టే రేపటి చర్చకు భయపడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ఆయన విమర్శించారు. దానికి వైసీపీ సభ్యుల నుంచి నిరసన ఎదురై వాదోపవాదాలు సాగాయి.