Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టించిన సింధు

By:  Tupaki Desk   |   22 Aug 2016 6:37 AM GMT
రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టించిన సింధు
X
మ‌న‌సులో ఎన్నున్నా వేడుక‌లు - శుభసంద‌ర్భాల్లో అంతా క‌లిసి క‌నిపిస్తుంటారు బంధుగ‌ణం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ బంధుగ‌ణం కూడా అలాగే ఒక్క‌చోట క‌లిసి ప‌క్క‌ప‌క్క‌నే నిల్చుని క‌నిపించ‌డం రెండు రాష్ర్టాల ప్ర‌జ‌ల‌ను సంతోషింప‌జేస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఢీ అంటే ఢీ అంటూ మాట‌లు విసురుకోవ‌డ‌మే కాకుండా కేసులు కూడా పెట్టుకుంటున్న నేత‌లు క‌లిసిమెల‌సి కనిపించారు. అంతా పుష్ప‌గుచ్ఛాలు - శాలువాలు ప‌ట్టుకుని ఒక విజేత కోసం ఒద్దిక‌గా నిల్చున్నారు. ఈ అరుదైన దృశ్యం ఈ రోజు ఉద‌యం శంషాబాద్ విమానాశ్ర‌యంలో క‌నిపించింది. ఒలింపిక్సు ర‌జ‌త ప‌త‌క విజేత - తెలుగు తేజం పీవీ సింధుకు స్వాగ‌తం ప‌లికేందుకు విమానాశ్ర‌యంలో ఏపీ - తెలంగాణ మంత్రులు ఒక్క‌చోటే నిరీక్షించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

రియోలో భారత సత్తా చాటిన పీవీ సింధు తెలుగు రాష్ట్రాల మంత్రుల‌ను మ‌ధ్య విభేదాల‌ను కాసేపు ప‌క్క‌న‌పెట్టేలా చేసింది. శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధుకు స్వాగతం పలికేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడికి తరలివెళ్లాయి. ఏపీ తరఫున డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప - విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిలతో కలిసి మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ - కేటీఆర్ - నాయిని నర్సింహారెడ్డి - మహేందర్ రెడ్డి - తలసాని శ్రీనివాస యాదవ్ - పద్మారావులు అక్కడికి వెళ్లారు. సింధు కోసం వేచి చూసే క్రమంలో వారంతా ఎయిర్ పోర్టు లాంజ్ ల్లో కూర్చున్నారు. అది కూడా పక్కపక్కనే కూర్చుని హాయిగా మాట‌లు చెప్పుకున్నారు.

ఈ దృశ్యాల‌ను టీవీల్లో చూసిన‌వారంతా సింధు త‌న ఒలింపిక్సు ప‌త‌కంతో దేశ ప్ర‌జ‌ల‌ను ఒక్క‌టి చేయ‌డ‌మే కాకుండా తెలుగు రాష్ర్టాల రాజ‌కీయ నేత‌ల‌ను కూడా ఏకం చేసింద‌ని అనుకుంటున్నారు. క్రీడ‌లు మ‌నుషుల మ‌ధ్య దూరాలు చెరిపేస్తాయ‌న‌డానికి ఇది తార్కాణ‌మ‌ని మురిసిపోతున్నారు.