Begin typing your search above and press return to search.

ఏపీ.. తెలంగాణ దొందూదొందేనా?

By:  Tupaki Desk   |   5 Jun 2016 11:47 AM IST
ఏపీ.. తెలంగాణ దొందూదొందేనా?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి రగడ రోజుకో రూపం దాలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుందంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేయటం.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కృష్ణా నది జలాల బోర్డు వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని.. ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ తెలంగాణ మంత్రి హరీశ్ ఆరోపించటంపై ఏపీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా తప్పు పడుతున్నారు. కృష్ణా జలాల్ని విడుదల చేయమని చెప్పిన అంశంపై హరీశ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న హరీశ్.. కృష్ణా నది జలాల బోర్డు అంశంపై కేంద్రమంత్రికి.. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పటం సరికాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం విజయవాడ దగ్గరున్న ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటిమట్టం 5 అడుగులకు పడిపోయిందని.. తాగునీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో 4టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 1.13 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసిందని ఉమ చెబుతున్నారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రస్తావించటం తప్పు ఎలా అవుతుందని ఉమ ప్రశ్నిస్తున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందనంటూ కేంద్రానికి ఏపీ సర్కారు ఫిర్యాదును తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. కృష్ణా నది జలాల బోర్డు వ్యవహారంపై కేంద్రమంత్రికి.. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తానంటే ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేయటం గమనార్హం. తప్పులు లేనప్పుడు ఫిర్యాదులతో ఏమవుతుంది? అంత అభ్యంతరాలు ఎందుకు..?