Begin typing your search above and press return to search.

ఏపీ - తెలంగాణ‌లో అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయోచ్‌

By:  Tupaki Desk   |   28 Jun 2017 7:04 PM IST
ఏపీ - తెలంగాణ‌లో అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయోచ్‌
X
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల సంఖ్య పెంచే విష‌యంలో రోజుకో వార్త తెర‌మీద‌కు వ‌స్తోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇందుకు సుముఖంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చటం కోసం తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు - ఆంధ్రప్ర‌దేశ్‌ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవటం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రం సైతం త‌న మాట‌మార్చుకుంద‌ని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి రెండు రాష్ట్రాల శాసన సభల స్థానాల పెంపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ శాసన సభ స్థానాల సంఖ్య 119 నుండి 153కు - ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రతిపాదించటం తెలిసిందే.

తెలంగాణలో అధికారంలోవున్న తెలంగాణ రాష్ట్ర సమితి - ఆంధ్రలో అధికారంలోవున్న తెలుగుదేశం అసెంబ్లీ స్థానాలు పెరిగే అంశాన్ని ఎరగా చూపించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవటం తెలిసిందే. పాతవారితో పాటు కొత్తగా చేర్చుకున్న వారికి కూడా టికెట్లు కేటాయించాలంటే రెండు శాసన సభల సీట్లు పెంచక తప్పదు. అందుకే రెండు రాష్ట్రాల సీఎంలు అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పెద్దఎత్తున ఒత్తిడి తీసుకు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంలోనే ఒత్తిడి చేయ‌డం స‌రైన‌ద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

నిపుణుల అభిప్రాయాల ప్ర‌కారం సీట్ల పెంపు విష‌యంలో కేంద్రం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి రాజ్యాంగంలోని 170 అధికరణకు సవరణ చేయడం. అది సాధ్యంకాని పక్షంలో ఏపీ విభజన చట్టాన్ని సవరించటం. రాజ్యాంగ సవరణ ప్రస్తుతం సాధ్యం కాదు కనుక విభజన చట్టాన్ని సవరించటం ద్వారా రెండు రాష్ట్రాల అసంబ్లీ సీట్లు పెంచేందుకు కేంద్రం సవరణ బిల్లును సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం రెండు శాసన సభల సీట్లు పెంచేందుకు సంబంధించిన నోట్‌ ను త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించిన అనంతరం, సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తేవొచ్చని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/