Begin typing your search above and press return to search.

అసలీ.. బీజేపీ నేతలకు ఏమైంది

By:  Tupaki Desk   |   2 March 2016 9:18 AM GMT
అసలీ.. బీజేపీ నేతలకు ఏమైంది
X
అసలే మతం ముద్ర ఉన్న పార్టీ.. అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి? ఏదో ఒక మతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అస్సలు కనిపించకూడదు. నిజానికి అలాంటి వైఖరి ఏమాత్రం సమర్థనీయం కాదు కూడా. దేశాన్ని పాలించే అవకాశం వచ్చినప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వారితో పాటు.. తమను వ్యతిరేకించే వారి మనసుల్ని దోచుకోవటమే పెద్ద పరీక్ష. మోడీ లాంటి నేతకు ఇలాంటివి కష్టమే కాకూడదు.

మైకు కనిపిస్తే చాలు.. సూక్తులు చెప్పే మోడీకి.. ఆయన బ్యాచ్ కి మధ్య ఏ మాత్రం పొంతన కుదరటం లేదు. పెద్దమనిషిలా మోడీ ఓపక్క మాట్లాడుతుంటే.. మరోవైపు ఏ మాత్రం బాధ్యత లేకుండా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఈ మధ్యన రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత చేసిన మాటల దుమారం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. జేఎన్ యూ విద్యార్థులు అలాంటోళ్లు.. ఇలాంటోళ్లు అనటంతోపాటు.. ఢిల్లీలో జరిగే అత్యాచారాల్లో సగం వారి వల్లేనన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

ఇదొక్కటే కాదు.. ఈ మధ్యనే ప్రపంచం నుంచి ఇస్లాంను తరిమేయాలని రీసెంట్ గా ఒక బీజేపీ నేత వ్యాఖ్య చేసి పరిస్థితిని రచ్చ రచ్చగా మారిస్తే.. తాజాగా బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇస్లాం మతం ఉన్నంత కాలం ఉగ్రవాదాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. భత్కల్ వంటి ప్రదేశాల్లో శాంతిని కాపాడాలంటే ప్రపంచం నుంచి ఇస్లాంను తరిమేయాలంటూ కామెంట్స్ చేయటం.. దీనిపై విపక్షాలు విరుచుకుపడేందుకు సిద్ధం అవుతున్న తీరు చూస్తుంటే.. ఈ బీజేపీ నేతలకు ఏమైందన్న భావన కలగటం ఖాయం.

తమను ఉడికించి.. రెచ్చగొట్టి తమ చేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసేలా ప్రయత్నించే కుట్రకు గుడ్డిగా ప్రతిస్పందించే కంటే.. ఆచితూచి వ్యవహరించటం మంచిదన్న విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోకూడదు. లేదంటే.. చేతికి వచ్చిన అధికారం చేజారిపోవటం పెద్ద కష్టమేం కాదన్న విషయాన్ని కమలనాథులు అర్థం చేసుకోవటం అత్యవసరం.