Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే మాట‌!.. వ‌ర్మ ఓ సైకో!

By:  Tupaki Desk   |   17 Oct 2017 4:27 AM GMT
టీడీపీ ఎమ్మెల్యే మాట‌!.. వ‌ర్మ ఓ సైకో!
X
టీడీపీ నేత‌ల‌కు - సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వ‌ర్మ‌కు మ‌ధ్య మొద‌లైన వివాదం.. ఏ స్థాయికి వెళుతుందో ఎవ‌రికీ తెలియ‌డం లేదు! టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు - విశ్వవిఖ్యాత నంద‌మూరి తార‌క రామారావు జీవితాంశం ఆధారంగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రాన్ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర నుంచి వ‌ర్మ-టీడీపీ నేత‌ల మ‌ధ్య వెర్బ‌ల్ వార్ కొన‌సాగుతూనే ఉంది. మొద‌ట ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ - త‌ర్వాత మంత్రి సోమిరెడ్డి - అనంత‌రం అనిత‌ - మొన్న వాణీవిశ్వ‌నాథ్‌.. ఇలా వ‌ర్మ‌ను హెచ్చ‌రిస్తున్నా.. వ‌ర్మ మాత్రం ఎక్క‌డా త‌గ్గేది లేదంటున్నారు. ఇప్పుడు మ‌రో టీడీపీ ఎమ్మెల్యే వ‌ర్మపై దాడి చేసినంత ప‌ని చేశాడు. వ‌ర్మ ఒక సైకో అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు!

అస‌లే వ‌ర్మ‌.. ఆపై ఎన్టీఆర్‌ పై సినిమా! ఇంకేముంది కావాల్సినంత ప‌బ్లిసిటీ! మాట‌ల‌కు లొంగ‌రు.. బెదిరింపుల‌కు అస్స‌లు త‌లొగ్గే ప్ర‌స‌క్తే లేదు! ఇక విమ‌ర్శిస్తే ట్విట‌ర్ వేదిక‌గా త‌నదైన కామెంట్ల‌తో కౌంట‌ర్లు - సెటైర్లు వేస్తూ.. మ‌రింత రెచ్చ‌గొడ‌తారు ! ఒక్క‌సారి ఆయ‌న త‌గులుకుంటే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే! అయినా టీడీపీ నేత‌లు మాత్రం ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయ‌న చేస్తున్న ప్రయత్నాలపై అనంత‌పురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాల మధ్య వర్మ చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. రామ్‌ గోపాల్ వర్మ ఓ సైకో అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు!

ఈజీ మనీ కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ సినిమాలు తీస్తున్నారని ఆయ‌న వ‌ర్మ‌పై దుమ్మెత్తిపోశారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్మాతలతో కలిసి సినిమా నిర్మిస్తే ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ సినిమా తీయడంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ శ్రేణులు విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే! మ‌రి వ‌ర్మ ఆ ఎమ్మెల్యేకి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!!