Begin typing your search above and press return to search.

ఆనంద్ మహీంద్ర చేసిన పనికి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   28 July 2022 3:40 PM GMT
ఆనంద్ మహీంద్ర చేసిన పనికి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్
X
ఆనంద్ మహీంద్రా దేశంలోనే బడా పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉంటారు. దేశ, అంతర్జాతీయ విషయాలపై స్పందిస్తుంటారు. ఆపదలో ఉండేవారిని ఆదుకుంటారు.. స్ఫూర్తినిచ్చేవారిని పొగుడుతుంటారు. ఆయన సమకాలీన రాజకీయాలపై , సమస్యలపై తన అకౌంట్ లో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. పలు పోస్టులు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. సోషల్ మెసేజ్ ఇచ్చేలా ఆనంద్ మహీంద్రా ట్వీట్లు చేస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా ఆనంద్ మహీంద్రా మరో అద్భుతమైన వీడియోను షేర్ చేశారు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతమైందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు. ‘ఈ ప్రిమిటివ్’ మెకానికల్ డివైస్ అద్భుతంగా .. అందంగా ఉందని.. సస్టైనబుల్, సమర్థవంతమైంది మాత్రమే కాదని.. కదులుతున్న శిల్పంలా ఉంది’ అంటూ కామెంట్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. లైక్ లు, కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. వండర్ ఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గ్రామాల్లో పొలాల్లోని నీటిని తోడే యంత్రంలాగా.. మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే దంపుడు సాధనం లాగా.. పక్కనే నీటి ద్వారా విద్యుత్తును తయారు చేసేందుకు ఉపయోగించేలా ఉన్న ఈ టెక్నిక్ చూసి యూజర్లు ఫిదా అవుతున్నారు.

పొలాల్లోకి నీటిని పంప్ చేయడానికి ఉపయోగించే చాలా పురాతనమైన పద్ధతి ఇది అంటున్నారు. నా బాల్యాన్ని గుర్తు చేశారంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒకవైపు హైడ్రాలిక్ పవర్, మరోవైపు వాటర్ పంపింగ్, అలాగే మహిళ ఒడ్లు లాంటివేవో దంచుతోంది. మూడు రకాలుగా ఉపయోగపడుతున్న దీనికి కరెంట్ అవసరం లేదు. చేతితోనే ఇదంతా చేస్తున్నారు. ఈ టెక్నాలజీ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అద్భుతమంటూ కొనియాడుతున్నారు.

ఇక సామాజిక సేవలోనూ ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తమిళనాడులోని పెరూ సమీపంలోని వడివేలం పాళ్యంలో రూ.1కే ఇడ్లీ సాంబర్, చట్నీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న వృద్ధురాలు కమలతల్ గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్నారు. 35 ఏళ్లుగా ఆమె కట్టెల పొయ్యిపైనే పేదల కోసం రూపాయి లాభం ఆశించకుండా ఆకలి తీరుస్తున్న వైనానికి ఆనంద్ మహీంధ్ర ఫిదా అయ్యాడు.. కమలతల్ అడ్రస్ తెలిస్తే చెప్పాలని ఆమె సంకల్పంలో తాను పెట్టుబడి పెట్టి ఆమెకు భరోసాగా నిలుస్తానని.. ఆమెకు ఒక మంచి గ్యాస్ స్టౌవ్ కొనిచ్చి కట్టెల పొయ్యికి స్వస్తి పలుకుతానని ట్విట్టర్ లో పిలుపునిచ్చాడు.. అన్నట్టే ఆమెకు సాయం చేసి ఆనంద్ మహీంద్రా తన మంచి మనసు చాటుకున్నారు.