Begin typing your search above and press return to search.

అన్నలు టీడీపీలోకి.. తమ్ముడు వైపీసీలోకి..

By:  Tupaki Desk   |   31 Jan 2016 2:36 PM IST
అన్నలు టీడీపీలోకి..  తమ్ముడు వైపీసీలోకి..
X
నెల్లూరు జిల్లా రాజకీయాలను ఇటీవల ఆనం బ్రదర్స్ మలుపు తిప్పితే.... ఇప్పుడు వారి మరో సోదరుడు ఆనం బ్రదర్స్ రాజకీయాన్ని మలుపు తిప్పడానికి రెడీ అవుతున్నారు. అవును.... కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుని టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ కు వారి మరో సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి షాకివ్వబోతున్నారు. ఇంకా చెప్పాలంటే నెల్లూరు రూరల్ మండడలంలో ఆనం వివేకానందరెడ్డికి అన్నీ తానే అయి వ్యవహరించే కుడి భుజం విజయ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలో ఆయన జగన్ పార్టీలో చేరబోతున్నారు.

విజయ్‌ కుమార్‌ రెడ్డి తన సొంత రాజకీయ భవిష్యత్తు నిర్మించుకునే దిశగా కదులుతున్నారని సమాచారం. అందుకే అన్నల నీడ నుంచి బయటపడి వైసీపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరబోతున్నట్లు విజయ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. అన్నలతో పాటు ఆయన టీడీపలో చేరలేదు.. కొద్దికాలంగా బయటే ఉన్నారు... ఆనం బ్రదర్స్ ఇద్దరూ టీడీపీలో చేరినా అక్కడ వారికి తొలుత ఇబ్బందులు ఎదురవడంతో ఆయన తన రాజకీయ మెదడుకు పనిపెట్టారు. టీడీపీలో ఆనం వారిని పూర్తిస్థాయిలో రిసీవ్ చేసుకోలేరని... అయినా కూడా పార్టీలోకి వచ్చిన పుణ్యానికి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టిక్కెట్ చంద్రబాబు వివేకాకు ఇవ్వడం ఖాయమని భావిస్తున్నారు. కానీ, స్థానిక టీడీపీ నేతల సహకారం ఆయనకు దొరకడం కష్టమవుతుందని... అప్పుడు తాను వైసీపీ నుంచి పోటీ చేస్తే అసెంబ్లీ మెట్లెక్కడం సులభమన్నది ఆయన ఈక్వేషన్. ఆ సమీకరణతోనే ఆయన వైసీపీలో ఎంట్రీకి రెడీ అవుతున్నారు. పైగా వివేకాకు కుడిభుజంగా ఉండడం వల్ల ఆయన గుట్టుమట్లన్నీ విజయ్ కు తెలుసు... క్యాడర్ కూడా విజయ్ వెనుక ఉన్నారు. దీంతో అన్నల నుంచి వేరుపడి విజయ్ ఇప్పుడు వైసీపీ గూటికి చేరబోతున్నారు. మరి ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండడంతో ఇప్పటి ఈక్వేషన్ అప్పుడు వర్కవుట్ అవుతుందో లేదో మాత్రం అనుమానమే. మొత్తానికి విజయ్ వైసీపీలో చేరడం మాత్రం వివేకాకు పెద్ద దెబ్బే.