Begin typing your search above and press return to search.

వైసీపీ అధిష్టానంపై ఆనం హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   2 Feb 2023 7:31 PM GMT
వైసీపీ అధిష్టానంపై ఆనం హాట్‌ కామెంట్స్‌!
X
వైసీపీ కంచుకోట జిల్లాల్లో ఒకటైన నెల్లూరు జిల్లా ప్రస్తుతం వైసీపీ అధిష్టానానికి ఇబ్బందులు కలిగిస్తోంది. రోజుకొకరు అన్నట్టు నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వెంకటగిరి వైసీపీ ఇంచార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డికి వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. అలాగే ఆయన సెక్యూరిటీని కూడా తగ్గించింది. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేగా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని.. ఇక నుంచి నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆనం తాజాగా మండిపడ్డారు. గత రెండేళ్లుగా తన ఫోనును ట్యాప్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు తన కుమార్తెతో మాట్లాడుకోవడానికి కూడా వాట్సాప్‌ కాల్‌ చేసుకోవాల్సి వస్తుందన్నారు.

ప్రస్తుత పరిణామాలపై ఆనం రామనారాయణరెడ్డి తాజాగా తన అనుచరులతో సమావేశమయ్యారు. మరో రెండు నెలల్లో మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుడదామని తన అనుచరులకు పిలుపునిచ్చారు. అందరూ సంఘటితం కావాలని కోరారు. వెంకటగిరి టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గమని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీనే చాలాసార్లు గెలిచిందని గుర్తు చేశారు.

వెంకటగిరి మునిసిపల్‌ ఎన్నికల్లో ఎంతో కష్టపడితే, కేవలం రెండు వేల ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చిందని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. వెంకటగిరిలో అసంతృప్తి ప్రారంభమైందన్నారు. తనను వైసీపీ అధిష్టానం పిలిచే అవకాశం లేదన్నారు. వైసీపీ అధిష్టానం నుంచి పిలిచే వారు లేరన్నారు. తనను పిలిచినా వారి ముందు చేతులు కట్టుకొని జవాబు చెప్పాల్సిన అవసరం తనకు లేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తనను విమర్శించే వారంత పెద్దవాడిని తాను కాదని ఆనంను విమర్శిస్తున్నవారిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వారికున్నంత రాజకీయ అనుభవం కూడా తనకు లేదన్నారు. తనను పార్టీలో అవమానించడం కంటే కూడా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు తన సోదరుడినే వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన సోదరుడు నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో తన కుమార్తె ప్రస్తావన తేవడం బాధ కలిగించిందన్నారు. బయట వాళ్లు మాట్లాడటం వేరన్నారు. తనను తన కుటుంబాన్ని సోదరుడే విమర్శించడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడినోళ్లే ఏదో ఒక రోజు నిజాలు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది. ఆయన పోటీ చేయకుంటే ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.