Begin typing your search above and press return to search.

పసుపు కండువాల్లో ఆనం బ్రదర్స్..

By:  Tupaki Desk   |   2 Dec 2015 11:45 AM IST
పసుపు కండువాల్లో ఆనం బ్రదర్స్..
X
నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆనం వివేకానందరెడ్డి - ఆనం రామనారాయణరెడ్డిల టీడీపీ ప్రవేశం పూర్తయింది. విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో బుధవారం ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనం సోదరులు మాట్లాడుతూ... జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తామన్నారు. అధికారం, పదవుల కోసం టీడీపీ పార్టీలో చేరడం లేదని ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. అన్నీ ఆలోచించాకే తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పారు. రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్‌ పార్టీ అప్పుడు రాష్ట్రాన్ని విభజించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయనకు నైతిక మద్దతునిచ్చేందుకే టీడీపీలో చేరామని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం తమవంతు కృషి చేస్తామని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల విభజనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆనం రాంనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎదురయ్యే సమస్యలను ఆనాడు కాంగ్రెస్‌ పెద్దలకు చెప్పామని గుర్తు చేశారు. అయినా తమ మాటలను ఆ పెద్దలు పట్టించుకోలేదన్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ లేకుండా పోయిందన్నారు. గత ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పార్టీ పరువును నిలిపేందుకు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడం జరిగిందని చెప్పారు. నెల్లూరులో టీడీపీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.