Begin typing your search above and press return to search.

సమంత కోరిక.. రేపల్లె ఓటరు తీర్చేశారు

By:  Tupaki Desk   |   23 May 2019 11:04 PM IST
సమంత కోరిక.. రేపల్లె ఓటరు తీర్చేశారు
X
నిజమేనండోయ్... టాలీవుడ్ హీరోయిన్ - అక్కినేని నాగార్జున కోడలు సమంత చెప్పింది. గుంటూరు జిల్లా రేపల్లె ఓటర్లు ఆమె మాటను తూచా తప్పకుండా పాటించారు. సమంత చెప్పినట్లుగా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ కు ఓటు వేసి మరీ గెలిపించారు. ఏపీలో వైసీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కిన నేపథ్యంలో చిన్నాచితక టీడీపీ నేతలకంతా ఓటమి తప్పదన్న వాదన వినిపించింది. ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ నేతలు, కాకలు తీరిన యోధులంతా వైసీపీ సునామీలో కొట్టుకుపోయారు.

గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ తో పాటు పొన్నూరు నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని భావించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా ఈ దఫా ఓటమి చవిచూశారు. మొత్తంగా 175 సీట్లలో వైసీపీ 150కి పైగా సీట్లను గెలుచుకుంది. ఈ మేర భారీ విక్టరీ సాధించిన వైసీపీ చేతిలో రేపల్లె నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ కు కూడా ఓటమి తప్పదన్న వాదన వినిపించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనగాని గెలిచారు. అయినా అనగాని గెలుపునకు - సమంత కోరికకు సంబంధం ఏమిటనేగా మీ ప్రశ్న.

సరే.. అయితే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిపోదాం. ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న వేళ... రేపల్లెలో ప్రత్యక్షమైన సమంత... అనగానిని గెలిపించాలని ఆ నియోజకవర్గ ఓటర్లను కోరారు. ఈ క్రమంలో రేపల్లె ఓటర్లలో మెజారిటీ అనగానికే ఓటేశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో టీడీపీలోని హేమాహేమీలంతా ఓడిపోయినా.. అనగాని మాత్రం గెలిచారు. ఈ నేపథ్యంలోనే సమంత కోరికను రేపల్లె ప్రజలు నెరవేర్చారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.