Begin typing your search above and press return to search.

ఆ మ‌హిళా సీఎం ఇంటిలో ఆగంత‌కుడు రాత్రంతా ఏం చేశాడు?

By:  Tupaki Desk   |   5 July 2022 9:45 AM GMT
ఆ మ‌హిళా సీఎం ఇంటిలో ఆగంత‌కుడు రాత్రంతా ఏం చేశాడు?
X
ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లో ఓ ఆగంత‌కుడు క‌ల‌క‌లం సృష్టించాడు. మ‌మ‌త‌కు జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉంది. అయినా భ‌ద్ర‌తా సిబ్బంది క‌ళ్లు క‌ప్పి ముఖ్య‌మంత్రి ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డ్డాడు. అంతేకాకుండా రాత్రంతా ఇంటిలోనే ఉన్నాడ‌ని అంటున్నారు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తిని సీఎం నివాసం ఆవరణలో చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ అనుకొని తాను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నివాసంలోకి ప్రవేశించినట్లు నిందితుడు తెలిపిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

అయితే అర్ధరాత్రి సమయంలో సీఎం ఇంటిలో ఎందుకు దూరావ‌ని అని అడిగితే సమాధానం చెప్పలేక నిందితుడు తడబడ్డాడ‌ని స‌మాచారం. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అర్ధరాత్రి సీఎం నివాసంలోకి అక్రమంగా చొరబడ్డందుకు నిందితులు హఫీజుల్‌ మొల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ నిమిత్తం అతడ్ని జూలై 11 వరకు కస్టడీకి తరలించారు.

కాగా పోలీసుల‌ విచారణలో అతడు ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతున్నాడని పోలీసులు చెప్పారు. మొదట తాను పండ్లు అమ్ముతాన‌ని చెప్పాడని, ఆ తర్వాత డ్రైవర్‌నని మాట మార్చాడని పేర్కొన్నారు. అయితే అతడ్ని చూస్తే మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తిలా కన్పిస్తున్నాడని తెలిపారు. సీఎం నివాసంలోకి ప్రవేశించడానికి ముందు ఆదివారం అతడు ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసుకుంటున్నామని, అతడు చెప్పిన వివరాల ప్రకారం మ్యాప్ రూపొందిస్తున్నామని వివరించారు. దీనిపై విచారణ చేపట్టి అతడు చెప్పింది నిజమో కాదో తేలుస్తామన్నారు.

కాగా కోల్‌కతాలో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ నివాసంలోకి ప్రవేశించిన ఈ వ్యక్తి పేరు హఫీజుల్‌ మొల్లా అని పోలీసులు తెలిపారు. ఇత‌డి వ‌య‌సు 30 ఏళ్లు అని అంటున్నారు. ఇత‌డి స్వ‌గ్రామం ఉత్తర 24 పరగణాలు జిల్లా హష్నాబాద్‌.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:20 గంటల సమయంలో కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్‌ ఛటర్జీ వీధి 34బీలో గోడ దూకి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించాడు. పటిష్ఠ భద్రత ఉన్నా.. ఎవరికంటా పడకుండా మ‌మ‌త నివాసంలోకి ప్ర‌వేశించాడు. దీంతో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.