Begin typing your search above and press return to search.

అమరావతి ఇంపాక్ట్... అందరూ అక్కడేనా... ?

By:  Tupaki Desk   |   16 Dec 2021 1:30 PM GMT
అమరావతి ఇంపాక్ట్... అందరూ అక్కడేనా... ?
X
అమరావతి రాజధానిని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వేళ ఎవరూ పెద్దగా అభ్యంతరాలు పెట్టలేదు. అదే సమయంలో ప్రతిపక్ష పాత్రలో జగన్ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. నాడు ఆయన అన్న మాట ఏమిటి అంటే ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకే మద్దతు ఇస్తున్నామని. అయితే అమరావతి రాజధాని మీద తరువాత కాలంలో వ్యతిరేకత రావడానికి వామపక్ష మేధావులు, రైతాంగ సంఘ నాయకులు, కొన్ని ప్రజా సంఘాల నేతలు కారణం అని చెప్పాలి. వారంతా ఆ తరువాత కాలంలో అమరావతికి వ్యతిరేకంగా పుస్తకాలు రాశారు. అంతే కాదు, పచ్చని పంటలు పండే ప్రాంతం, ముక్కారు పంటలు అందించే బంగారు నేలను అలా వేలాది ఎకరాలతో కాంక్రీట్ జంగిల్ గా మార్చడం తగునా అని గోడు పెట్టారు.

మరి కొందరు మేధావులు అయితే ఇంకాస్తా ముందుకెళ్ళి అమరావతి రాజధాని ఎవ‌రి కోసం అని కూడా పుస్తకాలు రాశారు. ఇక అమరావతి పేరిట రియల్ దందా సాగుతోందని నాడు విపక్షాలు కూడా ఆరోపించాయి. ఇక అనాడు జన‌సేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతులను కలిశారు. వారిని అన్యాయం జరిగితే ఊరుకోమని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమరావతి అందరి రాజధాని కావాలని కూడా గట్టిగానే కోరుకున్నారు.

దీంతో పాటుగా వామపక్ష నాయకులు అయితే రాయలసీమ ఉత్తరాంధ్రాకు అన్యాయం జరుగుతోందని కూడా విమర్శలు చేశారు. ఆ ప్రాంతాలకు న్యాయం చేయాలని వారు నినదించారు. హైకోర్టు రాయలసీమకు కేటాయించాలని కూడా పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనకబడిన జిల్లాలను ప్రగతి బాటన నడిపించాలని కూడా సూచించారు.

బీజేపీ అయితే మరో అడుగు ముందుకేసి 2018లో రాయలసీమ డిక్లరేషన్ పేరిట సమాంతర రాజధానినే కోరుకుంది. హైకోర్టు కర్నూల్ లో పెట్టాలని అలాగే శాసన సభ సమావేశాలు కొన్నిరాయల‌సీమలో నిర్వహించాలని కూడా పేర్కొంది. ఇలా వచ్చిన అభిప్రాయాలే మిగిలిన ప్రాంతాలలో కూడా చాలా మేర ప్రభావం చూపించాయి. దాని మీద ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ నాడు అమరావతి రియల్ దందాగా ఉందని పేర్కొంది. అయితే ఎన్నికల వేళ మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు.

మొత్తానికి బంపర్ మెజారిటీతో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ టైమ్ లో అమరావతి ఒక్కటే రాజధాని అంటూ నినదించినది మొదట ఉందీ అంటే అది ఒక్క టీడీపీ మాత్రమే. మిగిలిన పార్టీలు కొంతలో కొంత సందిగ్దంలో ఉన్నాయి. కానీ చూస్తూండంగా రెండేళ్ళ కాల వ్యవధిలో అన్ని పార్టీలూ తమ స్టాండ్ మార్చుకుని అమరావతికే జై అంటున్నాయి.

ఈ క్రమంలోనే మిగిలిన ప్రాంతాల్లో ప్రజా సంఘాల నుంచి కొన్ని పార్టీలకు వ్యతిరేకత ఎదురవుతోంది. రీసెంట్ గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సీమ హక్కుల కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తే ఆయనను అమరావతికి ఎలా మద్దతు ఇస్తున్నారని కొందరు నిలదీశారు. ఇదే అనుభవం సీపీఐకి, బీజేపీకి అవుతోంది. అన్నీ అమరావతిలో పెట్టాలంటూ రైతులు మహా పాదయాత్ర చేస్తూంటే మీరు మద్దతు ఇవ్వడమేంటి అని కూడా రాయలసేమ మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు అమరావతి ఏకైక రాజధాని అంటూ అవుట్ రేట్ గా సపోర్ట్ చేస్తున్న టీడీపీకే రేపటి ఎన్నికల్లో పొలిటికల్ మైలేజ్ ఫుల్ గా వస్తుంది. అమరావతి రాజధాని ప్రభావిత జిల్లాలల్లో టీడీపీకి పాజిటివ్ గా ఉంటుంది. కానీ అదే టీడీపీతో పాటు అడుగులు వేస్తున్న మొత్తం విపక్షానికి ఏం లాభం అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. మరో వైపు రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలు కలిపి ఏడు ఉన్నాయి. మరి ఈ జిల్లాల్లో రాజకీయ అనుకూలత విపక్షాలకు అవసరం లేదా, లేక వారంతా సర్దుకునిపోతారని అతి నమ్మకమా అన్న చర్చ కూడా వస్తోంది.

మొత్తం మీద మూడు రాజధానుల కాన్సెప్ట్ అన్నది కొత్త అయినా వైసీపీ సర్కార్ దాన్ని ముందు పెట్టింది. దాని వల్ల మూడు ప్రాంతాలలో మూడు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అమరావతికి జై అంటూ అన్ని రాజకీయ పార్టీలు కనుక ముందుకు పోతే సాలిడ్ గా మిగిలిన ఏరియాలను వైసీపీకే వదిలేసినట్లుగా అవుతుందన్న విశ్లేషణ కూడా ఉంది. మొత్తానికి ఇది రాజకీయంగా సామాజికంగా, ప్రాంతీయపరంగా కూడా విపక్షాలకు అతి పెద్ద చిక్కు ప్రశ్నగానే ఉంది. మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయో లేవో తెలియదు కానీ మిగిలిన ప్రాంతాల ఆకాంక్షలను విపక్షాలు గుర్తించడం లేదు అన్నది కనుక జనంలోకి బలంగా వెళ్తే మాత్రం పూర్తి నష్టం విపక్షాలకే అన్నదే ఒక విశ్లేషణ.