Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా అమరావతి ఎస్ ఐ లాడ్జి ఇష్యూ!

By:  Tupaki Desk   |   10 Jun 2020 10:30 AM IST
హాట్ టాపిక్ గా అమరావతి ఎస్ ఐ లాడ్జి ఇష్యూ!
X
తరచూ వార్తల్లోకి ఎక్కే ఏపీ రాజధాని అమరావతి.. తాజాగా మరో తరహా ఉదంతంలో అందరి నోట్లో నానుతోంది. అమరావతి ఎస్ఐ తీరు అభ్యంతరకరంగా ఉందంటూ ఆరోపణలతో పాటు..సీరియస్ కంప్లైంట్ ఒకటి ఫైల్ అయ్యింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన ఒక జంట ఏకాంతం కోసం అమరావతిలోని ఒక లాడ్జికి వచ్చారు.

వారికి సంబంధించిన వివరాల్ని తెలుసుకున్న అమరావతి ఎస్ఐ రామాంజనేయులు తన వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ తో కలిసి వచ్చారు. లాడ్జికి చేరుకున్న ఎస్ఐ.. ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన జంట గదికి వెళ్లారు. తనిఖీ పేరుతో వారిని బెదిరించినట్లుగా చెబుతున్నారు. రూ.10వేలు లంచం ఇవ్వకుంటే వ్యభిచారం కేసు నమోదు చేస్తానని వార్నింగ్ ఇవ్వటంతో.. వారు హడలిపోయారు. దీంతో భయపడిన ఆ జంట తాము అంత ఇచ్చుకోలేమని.. రూ.5వేలు ఇస్తామన్నారు. అందుకు ఎస్ఐ ఒప్పుకున్నారు. తీరా చూస్తే వారి దగ్గర రూ.3వేలు మాత్రమే ఉన్నాయి.

దీంతో రూ.2వేల కోసం ఏటీఎంకు వెళ్లి వస్తానని చెప్పిన ఆ వ్యక్తి బయటకు వెళ్లగా.. రూంలో ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. ఏటీఎంకు వెళ్లి తిరిగి వచ్చే వరకూ ఈ వేధింపులు సాగినట్లుగా చెబుతున్నారు. ఎక్కడెక్కడో చేతులు వేసి వేదనకు గురి చేసినట్లుగా సమాచారం.

రూ.5వేలు తీసుకున్న ఎస్ఐ రూంలో జరిగిన విషయాలు ఏమీ బయటకు వచ్చినా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఎస్ఐ వెళ్లిన తర్వాత.. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆ మహిళ చెప్పటంతో.. బాధితులు తుళ్లూరు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు ఎదురైన అనుభవం గురించి వారు చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు అమరావతి పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు రూరల్ ఎస్పీకి ఈ విషయం మీద సమాచారం అందటంతో.. దీనిపై విచారణకు ఆదేశించారు.