Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కి అమరావతి రైతుల సెగ ...ఏమైదంటే !

By:  Tupaki Desk   |   4 Feb 2021 11:50 AM GMT
సీఎం జగన్ కి అమరావతి రైతుల సెగ ...ఏమైదంటే !
X
ఏపీ సీఎం జగన్ ‌కు మరోసారి అమరావతి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్తున్న సమయంలో జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటన మందడంలో చోటుచేసుకుంది. మందడం మీదుగా సీఎం జగన్‌ కాన్వాయ్‌ లో సచివాలయానికి వెళ్తున్న సమయంలో రైతులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. రైతులతోపాటు మహిళలు అమరావతి ప్లకార్డులు పట్టుకుని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అయితే, కాన్వాయ్ ‌ని అడ్డుకుంటారన్న అనుమానంతో పోలీసులు రైతులకు అడ్డుగా నిలబడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయడంపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సమావేశాన్ని సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో ఆయన కాన్వాయ్.. వెళ్తోండగా..అమరావతి ప్రాంత రైతులు ఒక్కసారిగా రోడ్డు పక్కన నిల్చుని నిరసనలు తెలిపారు.

ఆకుపచ్చ జెండాలను ప్రదర్శించారు. జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి ఆంధ్రుల స్వప్నం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులను దొంగదెబ్బ తీస్తోందని విమర్శించారు. అయితే , పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సీఎం జగన్ క్యాన్వాయ్ అక్కడినుండి ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళింది.

ఇదిలా ఉంటే .. 415 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు.. 29 గ్రామాల రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళనలు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. 33వేల ఎకరాల భూమిని త్యాగం చేసి, ఐదు కోట్ల ఆంధ్రులకు రాజధాని ఇచ్చామన్నారు రైతులు.

అమరావతే ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించేవరకు వెనక్కి తగ్గేదే లేదు అని అంటున్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు కాబట్టే తమకు ముఖం చూపించలేకపోతున్నారని అంటున్నారు.