Begin typing your search above and press return to search.

సీఎం..అమిత్ షాలు వెళితే చ‌పాతి ప‌ప్పు పెట్టారు

By:  Tupaki Desk   |   31 July 2017 5:25 AM GMT
సీఎం..అమిత్ షాలు వెళితే చ‌పాతి ప‌ప్పు పెట్టారు
X
దేశంలో చాలానే పార్టీలు ఉన్నా.. బీజేపీ తీరు కాస్త భిన్నం. త‌మ‌ను తాము దేశ భ‌క్తులుగా చాటి చెప్పుకోవ‌టంతో పాటు.. ఆడంబ‌రాల‌కు దూరంగా ఉంటామ‌న్న సందేశాన్ని ఇస్తుంటారు. మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు భిన్న‌మైన వైఖ‌రి త‌మ‌ద‌న్న‌ట్లుగా వారి తీరు ఉంటుంది. అయితే.. వాస్త‌వంలో అలాంటి ప‌రిస్థితి ఉందా? అంటే.. అస‌లు నిజం అంద‌రికి తెలిసిందే.

అయితే.. దేశ వ్యాప్తంగా కార్య‌కర్త‌లు.. నేత‌ల ఇళ్ల‌కు పార్టీకి చెందిన అత్యుత్త‌మ నేత‌లు వెళ్ల‌టం ఒక రోటీన్ ప్రోగ్రాంగా చెప్పాలి. అయితే.. మిగిలిన పార్టీల్లో ఇలాంటివి క‌నిపించ‌వు. అధికార‌పార్టీకి చెందిన పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఒక సాదాసీదా నేత ఇంటికి వెళ్ల‌టం.. ద‌ళితుల ఇంట భోజ‌నం లాంటివి చేస్తూ.. దేశ ప్ర‌జ‌ల్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంటారు. త‌మ పార్టీ మిగిలిన పార్టీల‌కు భిన్న‌మ‌న్న సందేశాన్ని త‌మ చ‌ర్య‌ల‌తో స్ప‌ష్టం చేస్తుంటారు.

తాజా అలాంటి ప‌నే మ‌రోసారి చేశారు. యూపీకి చెందిన ఒక బీజేపీ యువ కార్య‌క‌ర్త ఇంటికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తో పాటు.. యూపీ ముఖ్య‌మంత్రి అదిత్య‌నాథ్ స్వ‌యంగా వెళ్ల‌టం ఆనందంతో ఆ కుటుంబం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కేవ‌లం కొద్ది గంట‌ల ముందు మాత్ర‌మే వారికి ఇంటికి విశిష్ట అతిధులు హాజ‌రు కానున్న‌ట్లుగా చెప్పటం ఈ కార్య‌క్ర‌మంలో కీల‌క అంశంగా చెప్పాలి.

33 ఏళ్ల సోనూ ఇంటికి అమిత్ షా.. సీఎంగా ఉన్న యోగిలాంటి వారు వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందంటంతో ఆ కుటుంబానికి విప‌రీత‌మైన టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అంత పెద్దోళ్లు త‌మ ఇంటికి భోజ‌నానికి వ‌స్తున్న‌ట్లుగా తేల‌టంతో వారేం చేయాలో అర్థం కాలేద‌ట‌. అయితే.. సోనూ వాళ్ల అమ్మ తార‌వ‌తి.. సోనూ స‌తీమ‌ణి దీనా చ‌క‌చ‌కా ప‌నులు చ‌క్క‌బెట్టేశార‌ట‌. అతిధులు ఇంటికి వ‌చ్చేస‌రికి వేడి వేడి అన్నం.. చ‌పాతి.. ప‌ప్పు.. స‌లాడ్‌.. పెరుగు.. రైతాను సిద్ధం చేసేశార‌ట‌. సోను ఇంటికి వ‌చ్చిన విశిష్ట అతిధులు వారు చేసిన మ‌ర్యాద‌కు ఫిదా అయిన‌ట్లుగా చెబుతున్నారు. భోజ‌నం ఎంతో రుచిక‌రంగా ఉంద‌న్న కాంప్లిమెంట్స్ ఇచ్చేసి ఆ ఇంటి వారికి తీపి గురుతుల్ని మిగ‌ల్చ‌టంతో పాటు.. త‌మ పార్టీ మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు ఏ మాత్రం పోలిక లేద‌న్న సందేశాన్ని దేశ వ్యాప్తంగా విస్త‌రించేలా చేశారు. ఏమైనా మోడీ.. అమిత్ షాల మాస్ట‌ర్ మైండే మైండ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.