Begin typing your search above and press return to search.

వివాదాస్పదం కాకుండా తప్పుకున్న బిగ్ బీ

By:  Tupaki Desk   |   21 Oct 2015 5:04 PM IST
వివాదాస్పదం కాకుండా తప్పుకున్న బిగ్ బీ
X
వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వాలకు అలవాటే. అందులో తాను భాగస్వామి కావటం.. వ్యవహారం మరింత ముదరక ముందే మేలుకొని తనలోని సమయస్ఫూర్తిని చాటుకున్నారు బిగ్ బీ అమితాబ్. ఉత్తరప్రదేశ్ సర్కారు ఇచ్చే యశ్ భారతి సమ్మాన్ అవార్డు పొందిన వారికి ప్రతినెలా రూ.50 వేల చొప్పున పెన్షన్ ను జీవితకాలం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా బిగ్ బీ అమితాబ్.. అభిషేక్ బచ్చన్.. జయాబచ్చన్ లకు ప్రతి నెల రూ.50వేల చొప్పున వారి జీవితాంతం పెన్షన్ లభించనుంది. ఈ భారీ నిర్ణయాన్ని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకన్నారు. దీంతో.. రచ్చ మొదలైంది. స్వాతంత్ర్య సమరయోధుల కంటే ఈ పెన్షన్ భారీగా ఉండటం.. బిగ్ బీ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న నేపథ్యంలో యూపీ సర్కారు నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.

ఈ జోరును గమనించిన అమితాబ్.. తనకు ఏ మాత్రం సంబంధం లేని వివాదంలో చిక్కుకోకూడదని నిర్ణయించుకున్నట్లుగా కనిపిచింది. యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై స్పందించి అమితాబ్.. యూపీ సర్కారు వెల్లడించిన పెన్షన్ పథకం ద్వారా తమకు అందించే పెన్షన్ మొత్తాన్ని పేదలకు ఖర్చు చేయాలని.. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులమంతా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా రాయనున్నట్లు వెల్లడించారు. నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమితాబ్.. యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎంతటి వివాదాస్పదం అవుతుందో గుర్తించి సమయస్ఫూర్తితో తన పెద్ద మనసును చాటుకున్నారని చెప్పొచ్చు.