Begin typing your search above and press return to search.

మరిన్ని సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తప్పవు ..పాక్ కి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ !

By:  Tupaki Desk   |   14 Oct 2021 1:24 PM GMT
మరిన్ని సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తప్పవు ..పాక్ కి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ !
X
దాయాది దేశమైన పాక్ కి కేంద్ర మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడటం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మరోసారి సర్జికల్ స్టైక్స్ చేయాల్సి వస్తుందని చెప్పారు. తమ పౌరులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని అమిత్ షా అన్నారు. గోవాలోని ధర్‌బందోరాలో జరిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

'ప్రధాని మోడీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్ ఒక ముఖ్యమైన నిర్ణయం. భారతదేశ సరిహద్దులను ఎవరూ విఘాతం కలిగించవద్దని మేము సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా సందేశం పంపాము. గతంలో చర్చలకు సమయం ఉండేది.. కానీ ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది అని అమిత్ షా అన్నారు. 2016లో భారతదేశంలోని యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి 19 మంది సైనికుల్ని బలితీసుకున్నారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఇప్పట్లాగే అప్పుడు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోకి వెళ్లిన భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఏం జరుగుతుందో పసిగట్టి శతృవు కోలుకునే లోపే శతృ శిబిరాలను ధ్వంసం చేయడమే సర్జికల్ స్ట్రైక్ ప్రత్యేకత.

2016లో ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ని పక్కా వ్యూహంతో సక్సెస్ చేసింది భారత సైన్యం. అర్థరాత్రి సమయంలో పీఓకేలోకి వెళ్లి మొత్తం ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు సైనికులు. యూరీ దాడి జరిగిన 11 రోజుల‌కే 2016 సెప్టెంబర్ 29 న సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, చివరకు డ్రోన్ల ద్వారా దాడులకు సైతం పూనుకుంటుంది పాకిస్థాన్.. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. అయితే సోమవారం జమ్మూ కశ్మీర్‌లో పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ అధికారి సహా, ఐదురుగు జవాన్లు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు వాస్తవాధీనరేఖను దాటి చర్మేర్ అటవీ ప్రాంతంలో చొరబడ్డారని నిఘా వర్గాల సమాచారం మేరకు.. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.